కేసీఆర్ తెలంగాణ సర్వే ప్రకటించినప్పుడు.. చాలా మంది పొలిటీషయన్స్ విమర్శించారు. కానీ ఇప్పుడు అదే సర్వే.. పని పూర్తికాకుండానే ఫలితాలు అందిస్తోంది. కళ్లు చెదిరేవాస్తవాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది. ఇప్పటివరకూ భాగ్యనగరంపై అధికారులకు ఉన్న అంచనాలు తప్పని నిరూపిస్తోంది. అధికారుల ముందు సరికొత్త భాగ్యనగరాన్ని చూపిస్తోంది. సర్వేతో అధికారులు ఇప్పటివవరకూ తమ వద్ద ఉన్న లెక్కలన్నీ కాకి లెక్కలేనని తేలిపోయింది. సరికొత్త లెక్కలు ఎంత అవసరమో చాటి చెప్పింది. హైదరాబాద్ మహానగర పరిధిలో ఇప్పటివరకూ 16 లక్షల వరకూ ఇళ్లు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. కొన్ని అనధికారికంగా భవనాలు ఉంటాయి కాబట్టి వాటిని 3 లక్షలుగా అంచనా వేశారు. మొత్తం కలిపి 19 లక్షల వరకూ ఉండొచ్చని భావించారు. కానీ సర్వే కోసం అధికారులు ప్పీ విజిట్ చేసినప్పుడు ఈ సంఖ్య పాతిక లక్షల వరకూ ఉండొచ్చని తేలింది. అంతే కాదు జనాభా విషయంలోనూ అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకూ భాగ్యనగర జనాభా 75 లక్షల పైచిలుకు అని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రీ విజిట్ ఫలితాల ప్రకారం.. హైదరాబాద్ జనాభా దాదాపు కోటి 20 లక్షల వరకూ ఉండొచ్చని తేలుతోంది. కొత్త అంచనాల ప్రకారం జీహెచ్ఎంసీ అభివృద్ధి ప్రణాళికల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. సౌకర్యాల కల్పనలోనూ కొత్త గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల మెరుగైన పథకాలు, సౌకర్యాలు ప్రజలకు అందే వీలుంది. కేసీఆర్ సమగ్ర సర్వేకు ముందు చెప్పిన మాటలు .. ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: