రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మారుతున్నాయనిపిస్తోంది. ఎంఐఎం పార్టీ కిరణ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడం వల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద ముప్పేమీ లేదు.  అయితే ఎంఐఎం మద్దతు ఉపసంహరణ వెనుక జగన్ హస్తం ఉందన్న ప్రచారంతో ఆపార్టీలోకి మరింత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు కూడా వెళ్తారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కిరణ్ సర్కార్ కు ముప్పు తప్పదు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి జారిపోతే కిరణ్ సర్కార్ మైనార్టీలో పడినట్టే.  ఇలాంటి సమయంలోనే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకం అవుతారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తేనే ప్రభుత్వానికి మద్దతిస్తామని తేల్చిచెబితే కాంగ్రెస్ హైకమాండ్ కు రెండే ఆప్షన్లు మిగులుతాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించడం. రెండోది కిరణ్ సర్కార్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం.  ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఇక్కట్టు తప్పవని కాంగ్రెస్ కు కూడా తెలుసు. దీంతో రాష్ట్ర విభజనపైనే దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్టు జగన్, ఎంఐఎంను దెబ్బతీయవచ్చు.  రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తే జగన్ తెలంగాణలో బలహీనపడతారు. ఎంఐఎం ఒక్క హైదరాబాద్ లో తప్ప తెలంగాణ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపదు. అటు సీమాంధ్రలోనూ ఎంఐఎం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ముస్లిం ఓటు బ్యాంకు కలిగి ఉంది. కాబట్టి ఇద్దరి కలయికను దెబ్బతీయవచ్చు. అయితే ఇదంతా టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపైనే ఆధారనడి ఉంటుంది. హైకమాండ్ కు అల్టిమేటమ్ ఇచ్చి తెలంగాణ కోసం పోరాడతారా లేక కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడతారా అన్నది తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: