ఒకవైపు మంత్రి అనీల్ కుమార్ యాదవ్. మరోవైపు కొడాలి నాని. ఇంకోవైపు కన్నాబు. ఇలా వరుసబెట్టి టీడీపీ చినబాబు నారా లోకేష్ ను ఓ రేంజిలో ఆటాడేసుకుంటున్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను, కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించే పేరుతో లోకేష్ మూడు జిల్లాల్లో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన పర్యటనల్లో ఏదో ఒకటి మాట్లాడేయాలన్న ఆతృతే లోకేష్ లో కనబడుతోందికానీ నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తున్నట్లు కనబడటం లేదు. ఇదే సమయంలో  బాధితులను పరామర్శించే పేరుతో వేస్తున్న నాటకాలు విచిత్రంగా ఉంటున్నాయి. ఈ విషయంలోనే మంత్రులు వరుసబెట్టి లోకేష్ ను మాటలతో వాయించేస్తున్నారు. చేపల చెరువుకు, వరి చేనుకు కూడా లోకేష్ కు తేడా తెలీదని ఓ మంత్రి కన్నబాబు అన్నారు.




తాజాగా  మరో మంత్రి  కొడాలి నాని మాట్లాడుతు లోకేష్ లాంటి వేష్ట్ మనిషిని ఎక్కడా చూడలేదంటూ విరుచుకుపడ్డాడు. లోకేష్ ఎక్కడ తిరిగినా ఉపయోగం ఉండదని తిరిగిన చోటల్లా పిచ్చి మాటలు మాట్లాడితే జనాలే బుద్ధి చెబుతారంటూ కామెంట్ చేయటం వైరల్ గా మారింది. రైతులకు సంకెళ్ళు వేశారని చెప్పి  తాను కూడా సంకెళ్ళు వేసుకున్న మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపినపుడు మరి తాను ఎందుకు కాల్చుకోలేదంటూ కొడాలి వేసిన ప్రశ్న సూటిటానే తగిలింది. పోలీసులపైన తిరగబడితేనే పోలీసులు వాళ్ళ చేతులకు బేడీలు వేసినట్లు పోలీసులు చెప్పిన విషయాన్ని కొడాలి గుర్తు చేశారు. ఎవరినీ ఉద్దేశ్యపూర్వకంగా తమ ప్రభుత్వం అవమానించటం జరగదన్నారు. అసలు రైతులకు బేడీలు వేసింది పోలీసులైతే ప్రతి విషయానికి ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డిని పిక్చర్ లోకి లాగం టీడీపీకి బాగా ఫ్యాషన్ అయిపోయిందంటూ మండిపడ్డారు.



మామూలుగా అయితే వైసీపీలో మంత్రులు కానీ సీనియర్ నేతలు కానీ లోకేష్ ను అసలు ఏమాత్రం లెక్కచేయరు. లోకేష్ ఎక్కడ పర్యటించినా ఎవరితో ఏమి మాట్లాడినా పెద్దగా విలువివ్వరు. మంత్రి అనీల్ మాట్లాడుతూ లోకేష్ మాట్లాడితే టీడీపీ నేతలు పెద్దగా సీరియస్ గా తీసుకోరని ఇక తామెందుకు పట్టించుకుంటామంటూ బొత్తిగా తీసిపారేశారు. మొన్నటికొ మొన్న కందిపప్పు తినటమే కానీ అది ఎలా పండుతుందో కూడా తెలీదంటూ లోకేష్ ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. కారణాలు ఏవైనా కానీండి రెండు రోజులుగా లోకేష్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను, ఆరోపణలను మంత్రులు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నారు. మంత్రులు అదే పనిగా లోకేష్ ను టార్గెట్ చేసుకోవటం చూస్తే ఏదో వ్యూహాత్మకంగానే మాటలతో దాడులు చేస్తున్నట్లు అనుమానంగా ఉంది.




ఉండి నియోజకవర్గంలో లోకేష్ పర్యటించినపుడు నడిపిన ట్రాక్టర్ కు ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయమై రాజ్యసభ ఎంపి విజియసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతు రోడ్డుపైన ఉన్న గుంతలోకి లోకేష్ ట్రాక్టర్ నడిపాడా ? లేకపోతే లోకేష్ ట్రాక్టర్ ఎక్కటం వల్లే రోడ్డులో గుంత పడిందా అంటూ సంధించిన ప్రశ్న బాగా వైరల్ అయ్యింది. మొత్తం మీద వైసీపీ ప్రయత్నాలు చూస్తుంటే లోకేష్ కు ఏమీ తెలీదు, ఏమీ చేతకాదు అని లోకానికి చాటి చెప్పాలని డిసైడ్ చేసుకున్నట్లే అనిపిస్తోంది. అందుకనే వ్యూహాత్మకంగా ఒకరి తర్వాత మరొకరు, ఒకేసారి ఇద్దరు ముగ్గురు అదేపనిగా లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు. చూద్దాం ఎవరి గాలి ఎవరు తీసేస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: