ఈరోజు న్యూస్ పేపర్లో ఓ వార్త ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. అదేమిటంటే దేశజనాభాలో సుమారు 40 కోట్లమంది టీవీకి దూరంగా ఉంటున్నారట. అంటే మనదేశ జనాభా 130 కోట్లమంది. ప్రతిరోజు టీవీలు చూస్తున్నవారి సంఖ్య సుమారు 89.2 కోట్లట. అంటే మిగిలిన కోట్లాదిమంది టీవీలు చూడటంలేదట. ఈ విషయం ఏదో గాలి మాటలు అనుకునేరు. మనదేశంలో టీవీ వ్యవహారాలను చూసేందుకు బార్క్ అని ఓ సంస్ధుంది. బార్క్ అంటే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రేటింగ్ కౌన్సిల్. మనకు ప్రసారమయ్యే కార్యక్రమాలు అంటే సీరియళ్ళు, సినిమాలు, స్పార్ట్స్, న్యూస్ తదితరాలన్నింటినీ ఎంతమంది జనాలు చూస్తున్నారు ? ఏ సమయంలో టీవీలను ఎక్కువమంది చూస్తున్నారు అని లెక్కేసేది బార్కే. ఈ సంస్ధ కట్టే లెక్కల మీదే ప్రోగ్రాముల రేటింగులు ఆధారపడుంటాయి.
మరి ఇంత ఘనమైన బార్క్ చెప్పిన తాజా లెక్కేమిటయ్యా అంటే దేశంలో టీవీలు చూస్తున్న వారి సంఖ్య 89.2 కోట్లని. దేశంలో టీవీలున్న కుటుంబాల సంఖ్య 2020 చివరినాటికి సుమారుగా 21 కోట్లట. అంటే ప్రతి కుటుంబంలోను సగటున 4 సభ్యులుంటారని అనుకుంటే టీవీలు చూసేవారి సంఖ్య 89 కోట్లని లెక్కలు కట్టింది. బార్క్ లెక్కలు కట్టిందంటే దాదాపు కచ్చితమైన లెక్కే అయ్యుంటుంది. గడచిన ఏడాదికిపైగా దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది కదా. అందుకనే జనాభాలో చాలామంది ఇళ్ళకే పరిమితమైపోయారు. దాంతో 2020లో టీవీలు చూసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయిందని బార్క్ చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 9.1 కోట్లు, గ్రామీణప్రాంతాల్లో 12 కోట్లకు చేరుకుంటుందట.
అంటే అధికారిక లెక్కల ప్రకారమే ఇంకా 40 కోట్లమంది టీవీలు చూడటంలేదని అర్ధమైపోయింది. మరి వీరంతా ఎందుకని టీవీలు చూడకపోయినా ఓ విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. అదేమిటంటే వాళ్ళంతా చాలా ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండే ఉంటారని. ఎందుకంటే సమాజంలో మనిపుడు చూస్తున్న చాలా దరిద్రాలకు టీవీలే కారణమని చెప్పకతప్పదు. పనికిమాలిన సీరియళ్ళు, క్రైంను ప్రోత్సహించే కార్యక్రమాలు, సినిమాలు, యువతను పెడదోవపట్టించే సినిమాలు లాంటివాటికి అన్ని కోట్లమంది దూరంగా ఉంటున్నారంటే కచ్చితంగా హ్యాపీగానే ఉండుంటారని అంచనా వేయచ్చు. నాగరీకత పేరుతో ఓటీటీ ప్లాట్ ఫారమ్ ల్లో వచ్చే కంటెంటును కుటుంబమంతా కలిసి చూడలేరు, చూడకుండా ఉండలేని పరిస్ధితి. ఇలాంటి పరిస్ధితి 40 కోట్లమందికి దొరికిందంటే ఎంత హ్యాపీనో కదా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి