
అంతే కాదు.. కొన్నిపథకాలకు గ్రామానికి ఇంత మందికే లబ్ధి అనే కోటాలు ఉండేవి. లబ్ధిదారుల ఎంపికలో కాలయాపన బాగా జరిగేది. ఎంత లబ్ధి కల్పిస్తారో.. ఎప్పుడు అందజేస్తారో ఏమీ తెలియని అనిశ్చితి నెలకొనేది. కొన్నిసార్లు పథకాల సొమ్మును ఇతర రుణాలకు జమ చేసుకునేవారు కూడా. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయందంటున్నారు వైసీపీ నాయకులు. జగన్ హయాంలో సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతున్నాయని చెబుతున్నారు.
ఎవరికైనా ఏ పథకమైనా రాకపోతే.. ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి, అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోతే వారికి మళ్లీ అవకాశం కల్పిస్తోంది జగన్ సర్కారు. అలా ఇటీవల దరఖాస్తు చేసుకున్న 9,30,809 మంది లబ్ధిదారులకు ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.703 కోట్లను జమ చేయనున్నారు. 3,44,497 మందికి పెన్షన్ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు అందజేస్తారు. 1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్లపట్టాలు ఇస్తారు. ఇలా మొత్తంగా 18,47,996 మందికి ప్రయోజనం కల్పిస్తారు.
ఎవరికైనా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందకపోతే ఆ దరఖాస్తును మళ్లీ పరిశీలిస్తారు. ఇలా ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తారు. అర్హులైన ఏ ఒక్కరూ పథకాల లబ్ధికి దూరం కాకూడదనేదే జగన్ సంకల్పం అంటున్నారు వైసీపీ నేతలు.