
న్యూటన్ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త, తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం, అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది. 1687లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది.
ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ, గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.