తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది హాస్య నటులు ఉన్నా కొంత మంది మాత్రం ఎప్పటికీ ప్రజల మనసుల్లో ఉండిపోతారు. అటువంటి వారిలో ఒకరే హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఈయన 20 సెప్టెంబర్ 1954 లో ప్రకాశం జిల్లా కొమ్మినేని వారిపాలెం లో జన్మించాడు. చిన్న తనం నుండే నాటకాలపై మరియు నటనపై ఎంతో ఆసక్తి ఉండేది. ఒకవైపు చదువుకుంటూనే నాటకాలు రాసేవాడు. అలా కొన్ని కథలు ధర్మవరపు కు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అంతకు ముందు వరకు ఇంటర్ ఫెయిల్ అయినా తల్లి బాధను తట్టుకోలేక కష్టపడి రెండవసారి ఇంటర్ లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ నాటకాలు రాస్తూ ఉండేవాడు. స్నేహితుల ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి హైదరాబాద్ లో పంచాయతీ రాజ్ భవన్ శాఖ లో ఉద్యోగాన్ని సంపాదించాడు.

కానీ ఉద్యోగం చేస్తున్నా తన మనసుకి ఏదో లోటు. ఆ తరువాత నాటకాల కోసం, తాను ఆశపడిన జీవితం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఆకాశవాణి మరియు దూరదర్శన్ లలో నాటకాలు రాయడం మొదలెట్టాడు. ఆ విధంగా పలు నాటకాలు రాశాడు.  ముఖ్యంగా దూరదర్శన్ లో "ఆనందో బ్రహ్మ" తో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. ఈ నాటకం ద్వారా జంధ్యాల సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా నుండి వెనక్కు తిరిగి చూసింది లేదు. అప్పట్లో జంధ్యాల సినిమాలో నటించడం అంటే మాటలు కాదు. ఇక అప్పటి నుండి ఎన్నో సినిమాల్లో హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాను నటించిన అనేక పాత్రలలో కొన్ని పాత్రలు మాత్రం ఎప్పటికీ ప్రజల మనసులో గుర్తుండిపోతాయి.

అలాంటి వాటిలో ఒక్కడు సినిమాలో పాస్ పోర్ట్ అధికారిగా ఎంతలా నవ్వించాడో తెలిసిందే. వర్షం మరియు రెఢీ సినిమాలలో తన పాత్రలు అంతే హాస్యాన్ని పండించాయి.  అలా తన ఆరోగ్యం బాగున్నంత వరకు సినిమాలలోనే నటించాడు. చవరికి కాలేయ సంబంధిత క్యాన్సర్ తో 7 డిసెంబర్ 2013 న తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. అలా ధర్మవరపు సుబ్రమణ్యం చనిపోయినా ఆయన చేసిన పాత్రల రూపంలో ఇంకా ప్రజల మనసుల్లో బ్రతికే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: