
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన ఈ మాసంలో చేసే స్నానాలు, పూజలు, దీపారాధన, దీపదానం అనంత పుణ్యఫలాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా కార్తీకమాసంలో నదులు, చెరువులు, కోనేరులలో దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఈ ఆచారంలో కేవలం ఆధ్యాత్మిక అంశాలే కాక, శాస్త్రీయ రహస్యాలు కూడా నిగూఢమై ఉన్నాయి.
సృష్టికి మూలమైన పంచభూతాలు (ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి) శివుని పంచాక్షరీ మంత్రం 'ఓం నమః శివాయ' నుంచి ఉద్భవించాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుడు పంచభూత స్వరూపుడు. ఈ పంచభూతాలలో ఒకటైన నీరు (జలం), మరొకటైన అగ్ని (దీపం)ని కలిపి పూజించడం ద్వారా పంచభూతాలను ఆరాధించినట్లు అవుతుంది. ఆత్మ జ్యోతిస్వరూపమని, ఆత్మను పరమేశ్వరుడికి అంకితం చేయడమే ఈ దీపాలను నీటిలో వదలడంలో ఉన్న ప్రధాన ఆంతర్యం అని పండితులు వివరిస్తారు.
కార్తీకమాసంలో నదీ స్నానం చేసి, దీపాలను నీటిలో వదలడం వల్ల పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ఈ జన్మలో తెలిసీ తెలియక చేసిన పాపాలు నశించిపోతాయని, కైలాస ప్రాప్తి కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది. ఈ మాసంలో దీపదానం చేయడం వలన కష్టాలు తొలగి, సర్వసుఖాలు, మోక్షం లభిస్తాయని నమ్మకం.
కార్తీక మాసమంతా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నీటిలో నివసిస్తాడని, అందుకే ఈ పవిత్ర సమయంలో నీటిలో దీపాలను వదిలితే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక మాసంలో పూర్వీకులు తమ బంధువులను సందర్శిస్తారనే నమ్మకం కూడా ఉంది. నీటిలో దీపాలు వదలడం వలన వారికి శాంతి లభించి, దుష్ట శక్తులు దూరం అవుతాయని భావిస్తారు. కార్తీక మాసం శీతాకాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు వచ్చి, వ్యాధి నిరోధకత తగ్గి, క్రిములు, కీటకాలు పెరిగే అవకాశం ఉంటుంది.
నదీ స్నానాలు చేయడం వలన నది నీటిలోని ఔషధ గుణాలు కలిగిన మూలికల ప్రభావంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక నదిలో లేదా నీటి ప్రవాహం ఉన్న చోట నేతి దీపాలను వదలడం వలన దీపాల వేడికి వాతావరణంలోని క్రిములు, కీటకాలు, దోమలు నశించి గాలి శుద్ధమవుతుందని, తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయని శాస్త్రీయంగా కూడా భావిస్తారు.