మూలిగే నక్కపై తాడిపండు పడినట్లుగా ఉంది భారత క్రికెట్ జట్టు పరిస్థితి. ఒకప్పుడు అన్ని ఫార్మెట్లలో ఏకఛత్రాధిపతిగా వెలిగిన టీమిండియా... ఇప్పుడు గెలుపు కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. ఫార్మెట్ ఏదైనా మేమే నంబర్ వన్ అన్నట్లుగా సాగింది టీమిండియా పరిస్థితి. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో టీమిండియాతో మ్యాచ్ అంటే భయపడిన జట్లు కూడా.. ఇప్పుడు సిరీస్ ఆడదాం రెడీనా అని కబురు పెడుతున్నాయి. ఇందుకు భారత క్రికెట్ ఆట తీరు మాత్రమే ఉదాహరణ. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓడిన నాటి నుంచి భారత క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఫార్మెట్ ఏదైనా సరే.. గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. ఇక మూడు వన్డేల సిరీస్‌లో కూడా 0-1 తేడాతో వెనుకబడింది. మరో మ్యాచ్ ఓడితే చాలు.. పరిమిత ఓవర్ల కప్ కూడా సౌతాఫ్రికా ఖాతాలో చేరుతుంది.

టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ప్రస్తుతం మరో బిగ్ షాక్ తగిలింది. నిన్నటి వరకు టెస్టు ర్యాకింగ్స్‌లో టీమిండియా టాప్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మొద‌టి స్థానం కోల్పోయింది టీమిండియా. భారత జట్టు స్థానాన్ని ఇటీవ‌ల యాషెస్ సిరీస్‌ను 4-0తో గెలుచుకున్న ఆస్ట్రేలియా కైవ‌సం చేసుకుంది. ఇక భార‌త్‌పై టెస్టు సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా కూడా ర్యాంకింగ్స్‌లో పైకి ఎగ‌బాకింది. సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ఓటమితో టీమిండియా రెండు స్థానాలు దిగజారి పోయింది. టాప్ ప్లేస్ నుంచి మూడో స్థానానికి ప‌డిపోయింది. ప్ర‌స్తుతం భార‌త్ ఖాతాలో 116 పాయింట్లు ఉన్నాయి. ఇక భార‌త్‌పై 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా జ‌ట్టు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి ఎగ‌బాకింది. స‌ఫారీల ఖాతాలో 101 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. యాషెస్ సిరీస్‌లో ఐదు టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 119 పాయింట్లు చేరాయి. ఇక బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ డ్రా చేసుకున్న న్యూజీలాండ్ జట్టు 117 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: