టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గురించి క్రీడాభిమానులు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ టాలెంటెడ్ ఆటగాడిని ఐసీసీ అవార్డు వరించింది. అవును, ఈ ముంబై బ్యాటర్ 2025 మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ ట్రోఫీని గెలుచుకోవడంతో అభిమానులు సంబరాలలో మునిగిపోయారు. ఐసీసీ ఈ విషయాన్ని మంగళవారం (ఏప్రిల్ 15) అధికారికంగా ప్రకటించడం విశేషం. 2025 మార్చిలో శ్రేయాస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఆటని కనబరిచాడు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ అందరికంటే బాగా రాణించడంతో అందరి దృష్టి అతనిపైకి మరలింది.

మార్చి నెలలో అయ్యర్ మొత్తం 3 మ్యాచ్‌ల్లో 172 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై శ్రేయాస్ 98 బంతుల్లో 79 పరుగులు చేసి, జట్టు విజయం పొందడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 45 పరుగులు చేసిన అయ్యర్.. ఆ తర్వాత ఫైనల్లోనూ ఒత్తిడిలో 48 పరుగులు చేసి అక్షర్ పటేల్ తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 43 యావరేజ్ తో 243 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా నిలిచి రికార్డుల్లోకి ఎక్కాడు. అవార్డు గెలిచిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలపడం గమనార్హం.

ఈ సందర్భంగా ఆయన "మార్చి నెలలో ఐసీసీ మెన్స్ ప్లేయర్ గా  ఎంపిక కావడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. ఎందుకంటే ఈ గుర్తింపు అనేది నావంటి క్రీడాకారులకు మరెంతో స్ఫూర్తినిస్తోంది. ముఖ్యంగా మనం ఐసీసీ ట్రోఫీని పైకి ఎత్తిన క్షణాన్ని అప్పటికీ, ఎప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేను. పెద్ద టోర్నీలో టీమిండియా విజయానికి కారణమవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. అదే నా కల కూడా. ఇక ఈ సందర్భంగా నేను నా సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి  థాంక్స్ చెబుతున్నాను!" అని అయ్యర్ అన్నాడు. అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీ బిజీగా ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బ్యాటర్ గా, కెప్టెన్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు అనడంతో అతిశయోక్తి లేదు. అయ్యర్ సారధ్యంలోని పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు గెలిచింది. బ్యాటర్ గాను సత్తా చాటుతూ ఐదు మ్యాచ్ ల్లో 250 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: