అమరావతి 2.0 నిర్మాణ పనుల వేగం .. ప్రధాని మోదీ చేతుల మీదుగా మే నెలలో పునఃప్రారంభించిన తర్వాత అమరావతి 2.0 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఆర్డీఏ పరిపాలన భవనం నిర్మాణం పూర్తి కాగా, హోటళ్లు, విద్యాసంస్థల పనులు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు విరామం లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే, రాజధానిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద ఒకేచోట 12 జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాల నిర్మాణానికి ముహూర్తం నిర్ణయించారు.గతంలో వెనకడుగు వేసిన బ్యాంకులు .. 2014-19 మధ్య కాలంలోనే ఈ 12 జాతీయ బ్యాంకులకు రాజధాని అమరావతిలో భూములు కేటాయించినా, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో బ్యాంకులు నిర్మాణ పనులకు వెనకడుగు వేశాయి. భూములను స్వాధీనం చేసుకోలేకపోయాయి.
కూటమి ప్రభుత్వంలో పునఃప్రారంభం .. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణంపై శ్రద్ధ వహించడంతో, బ్యాంకులతో సంప్రదింపులు ఫలించి, నిర్మాణాలకు సిద్ధమయ్యాయి. ఎస్బీఐకి 3 ఎకరాలు కేటాయించారు. అక్కడ 14 అంతస్థుల్లో ఎస్బీఐ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించనుంది. కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రధాన బ్యాంకులన్నీ ఉద్దండరాయుని పాలెంలో తమ కార్యాలయాలను నిర్మించనున్నాయి. రాజధాని ప్రాంతంలో బ్యాంకులు అన్నీ ఒకేచోట ఉండటం వల్ల ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. తుఫాన్ ముప్పు తొలగగానే ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి