ప్రస్తుతం జనవరి 9, 10, 11 తేదీలకు హైదరాబాదు నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లు అన్ని రిగ్రీట్ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా కోణార్క్, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, జన్మభూమి, ఫలక్‌నుమా, ఎల్టీటీ, గరీబ్ రథ్ వంటి రైళ్లలో ఒక్క సీటు కూడా దొరకడం లేదు. సంక్రాంతి జనవరి 13, 14, 15 తేదీల్లో జరగనుండటంతో ముందుగానే సొంతూరు వెళ్లే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాకుండా, బస్సులపై కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. పండగ సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు చార్జీలను పెంచే అవకాశం ఉండటంతో ప్రయాణికులు ట్రైన్ టికెట్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ టికెట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్లు నడిపే అవకాశముందా? అన్న దానిపై ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక టికెట్ బుకింగ్‌లో కూడా కొత్త నిబంధనలు ప్రయాణికులకు సవాల్‌గా మారాయి. ఐఆర్‌సీటీసీ ఖాతాతో ఆధార్ కార్డు లింక్ ఉన్నవారికే ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. లింక్ చేయని ఖాతాలకు 8.15 తర్వాతే యాక్సెస్ ఉంటుంది. ఈ మార్పు వల్ల సాధారణ ప్రయాణికులు తత్కాల్ టికెట్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన కోస్తా జిల్లాల వాసులు లక్షలాదిగా ఉండటంతో రైల్వే టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. “రైలు దొరకడం కంటే లాటరీ గెలవడం సులభం” అంటున్నారు ప్రయాణికులు. మొత్తం మీద ఈ సంక్రాంతికి సొంతూళ్ల బాట పట్టే ఆంధ్రావాసులు రైలు టికెట్ల కోసం నానా హైరానా పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి