‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న భారీ యాక్షన్–ఎంటర్టైనర్ ‘పెద్ది’ చిత్రంలోని ‘చికిరి చికిరి’ పాట ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ విడుదలైన మొదటి రోజునుంచే సోషల్ మీడియాను పూర్తిగా షేక్ చేసింది. రామ్ చరణ్ వేసిన ఎనర్జిటిక్ హుక్ స్టెప్, జాన్వీ కపూర్ అందాలు—ఈ రెండూ పాటలో మేజర్ హైలైట్‌గా మారాయి. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ రీల్స్‌—ఎక్కడ చూసినా చికిరి చికిరి స్టెప్పులే కనిపించేలా ట్రెండ్ అయ్యింది. ఈ పాటకు చిన్నా–పెద్దా అనే తేడా లేదు; విద్యార్థులు, ఉద్యోగులు, సెలబ్రిటీస్, ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్, ఇంకా రాజకీయ నాయకుల వరకు అందరూ తమదైన స్టైల్లో డ్యాన్స్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు.
 

తాజాగా కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు పంతగాని నరసింహ ప్రసాద్ కూడా ఈ పాటకు ఊర నాటు స్టెప్పులు వేశారు. ఆ స్టెప్స్  సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఆయన డ్యాన్స్‌లో ఉన్న ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెట్టింట ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. “ఇదేం మాస్ వైబ్ రాజా!” అంటూ కామెంట్స్ వరదలా వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే చికిరి పాటపై ఉన్న క్రేజ్ పూర్తిగా దూకుడు మీదే కనిపిస్తుంది. ఇప్పటివరకు అన్ని భాషలలో కలిపి ఈ సాంగ్ యూట్యూబ్‌లో 90 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి, వేగంగా 100 మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. అంతేకాకుండా 1.5 మిలియన్ లైక్స్‌తో దుమ్ము రేపుతోంది. ఈ ‘పెద్ది’ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అయితే షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఆ డేట్ కొంచెం ముందుకా, వెనక్కా జరగవచ్చని ఇండస్ట్రీ టాక్. అయినప్పటికీ, ఈ చిత్రం వచ్చే సమ్మర్‌లో మాత్రం ఖచ్చితంగా థియేటర్లలోకి రానుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.



ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార‍్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్, గ్రాండ్ స్కేల్, పాన్ ఇండియా అంచనాలతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: