సాధార‌ణంగా మ‌హిళ‌లు మామూలు స‌మ‌యంలో కంటే.. గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడు ఎన్నో జాగ్ర‌త్త‌లు పాటించాలి. పెళ్లైన ప్ర‌తి స్త్రీ.. తాను త‌ల్లి కావాల‌ని ఆరాట‌ప‌డుతుంది. అలాంటి టైమ్‌లో తాను గ‌ర్భ‌వ‌తి అని తెలిసిన‌ప్పుడు ప‌డే ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేనిది. స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం  పోస్తున్న టైమ్‌.. అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. ఇవన్ని కూడా ఆమె జీవితంలో చాలా ముఖ్యం. ఈ సమయంలో స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటే అది పుట్టబోయే బిడ్డకి, ఆమెకి అంత మంచిది. మేకప్ అనేది ఇప్పుడు సాధారణ విషయమైపోయింది. చాలామంది మహిళలకు మేకప్ అంటే పిచ్చి. 

 

తాము అందంగా కనిపించాలన్న తాపత్రయంతో తరుచూ మేకప్ వేసుకుంటూనే ఉంటారు. ఇక వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌ ఉన్నాయన్న సంగతీ తెలిసిందే. అయితే ప్రెగ్నన్సీ సమయంలో ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మరింత దుష్ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా పుట్టే పిల్ల‌ల‌పై దీని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. గర్భిణులు వీటిని వాడితే పుట్టబోయే పిల్లల్లో శారీరక కదలికలు తక్కువవుతాయని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాస్త‌వానికి సౌందర్య సాధనాల్లో సథాలేట్స్‌ అనే రసాయనాలుంటాయి. గర్భిణులు వీటిని వినియోగిస్తే, పుట్టే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ఆధ్య‌య‌నం చేయ‌గా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

 

గర్భిణులు వాడే రసాయనాల కారణంగా వారి పిల్లలు యుక్తవయసుకు వచ్చే సమయంలో చాలా ఇబ్బందులకు గురవుతార‌ట‌. ముఖ్యంగా చురుగ్గా కదల్లేరు. అంతేకాకుండా ఆత్మన్యూనత, ఆందోళన, వ్యాకులత, తదితర సమస్యలు వారిని చుట్టుముట్టే ప్రమాదముంది. అలాగే  మేకప్ వస్తువులు వాడే వారికి పుట్టే పిల్లలు తక్కువ బరువుతో కూడా పుడ‌తార‌ట‌. దీని వ‌ల్ల పిల్ల‌లు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అందువల్ల గర్భిణి స్త్రీలు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకపోవడమే మేలు. అంతగా మానలేకపోతే ముందుగా డాక్టర్ సంప్రదించి వారి సూచనల మేరకు వాడితే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: