కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ను జీవాయుధం గా అభివర్ణించడం తో ఐషా సుల్తానా పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో గత రెండు రోజులుగా ఆమె పేరు మార్మోగిపోతోంది. గూగుల్ సెర్చ్ లో ఆమె కోసం వెతుకులాట మొదలయింది. బిజెపి లక్షద్వీప్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ సుల్తానా పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్షద్వీప్ ప్రస్తుత రాజకీయ సంక్షోభం పై ఓ మలయాళ న్యూస్ ఛానల్ తో సుల్తానా మాట్లాడుతూ కేంద్రం పైన, ప్రఫుల్ పటేల్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుల్తానా మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ జీవాయుధం అనే పదాన్ని ఉపయోగించినట్టు చెప్పారు. పటేల్ , ఆయన విధానాలు అలానే ఉన్నాయని అందుకనే అలా అభివర్ణించినట్టు పేర్కొన్నారు. తాను పటేల్ ను బయోవెపన్  అని పేర్కొన్నాను తప్పితే ప్రభుత్వాన్ని కానీ దేశాన్ని కానీ ఏమీ అనలేదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.

బయో వెపన్ అని కాకుండా ఇంకా ఏమి అని ఆయనను అనాలని సుల్తానా ప్రశ్నించారు. లక్షద్వీప్ లో ఇటీవల ప్రతిపాదించిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో సుల్తానా ముందు ఉన్నారు. లక్షద్వీప్ లోని చెట్లాట్ దీవి కి చెందినవారు ఐశా సుల్తానా. నటి మోడల్ డైరెక్టర్ గా ఈమె పనిచేశారు. మలయాళ సినిమా కెట్యోలను ఎంటే మలకా కు అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నారు. 2020లో ఫ్లష్ అనే మలయాళ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించారు. సుల్తానా పై దేశద్రోహం అభియోగాలు మోపడం పై లక్షద్వీప్ సాహిత్య ప్రవర్తక సంఘం ఖండించింది. లక్షద్వీప్ ను పటేల్ కోవిడ్ శోధన ప్రాంతంగా తయారు చేయాలని చూస్తున్నారని మండిపడింది. ప్రఫుల్ పటేల్ అవమాన విధానాలకు వ్యతిరేకంగా ఆమె స్పందించారని తెలిపింది. ఆమెను దేశద్రోహిగా అభివర్ణించడం సరి కాదని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: