విశాఖలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ నుంచి కెమికల్ గ్యాస్ లీకై 3 కిలోమీటర్ల మేర వ్యాపించడంతో స్థానికులు అస్వస్థతకు గురవుతున్నారు. గ్యాస్ పీల్చిన వారిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమంది రక్తం కక్కుకుంటున్నారని, నోటి నుంచి నురగ వస్తోందని, చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. 
 
పరిశ్రమ నుంచి స్టైరేన్ అనే గ్యాస్ లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 200 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. పోలీసులు వారిని ఆంబులెన్స్, పోలీస్ వాహనాల సహాయంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్, నగర పోలీస్‌ కమిషనర్ ఆర్‌.కె.మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్ ఈ ఘటన గురించి అధికారులను ఆరా తీశారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: