దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి బ్రేకులు పడ్డాయి. కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కరోనా కేసులు తగ్గుముఖం పడటం సంతోషకరమైన అంశం. ఈ వారంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతాయని అంచనాలు వేసినా.. ఊహించని రీతిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశ ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది.


గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,55,874 లక్షల కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. అయితే కేసుల సంఖ్య నమోదుతో కొంత ఉపశమనం లభించినా.. మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 614 మంది మరణించారు. అయితే సోమవారంతో పోలిస్తే కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 16 శాతం తగ్గుదల ఏర్పడింది. దీంతో పాజిటివిటీ రేటు 20.75 శాతం ఉండగా.. 15.52 శాతానికి పడిపోయింది. నిన్న ఒక్కరోజే దాదాపు 2,67,753 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.


దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,70,71, 898 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసులు.. 22,36,842 లక్షలు. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు తగ్గటంతో భారత్‌కు కాస్త ఊరట లభించింది. వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఊహించని రీతిలో కరోనా కేసులు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి.


అయితే కరోనా కేసుల్లో తగ్గుదలను బట్టి చూస్తే.. రాబోయే రెండు వారాల్లో భారీగా కేసులు తగ్గే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కేసులు అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేయించుకుని కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని కేంద్రం సూచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: