తక్కువ మార్కులు వస్తే ఆత్మ హత్య పరీక్షలో ఫెయిల్‌ ఆత్మహత్య
ఉద్యోగం దొరక్క పోతే ..జీతం పెరగక పోతే ... అప్పులు పెరిగితే ఆత్మ హత్య ...
వేల కోట్ల ఆస్తి ఉన్న కాఫీ డే సిద్దార్థ ఆత్మ హత్య ..
ఈ సమాజానికి ఏమైంది ? అన్నీ ఉండి ...
ఎవరూ లేనట్టు ఎందుకిలా అర్ధాంత రంగా రాలి పోతున్నారు ...
అరచేతిలో ప్రపంచం ఇమిడి పోయింది కానీ, జీవితమే అర్థం కావడం లేదు ...


 బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్‌ మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్లి కనిపించకుండా పోయిన, కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు, వీజీ సిద్దార్థ మిస్సింగ్‌ కేసు విషాదాంతం అయింది.


ఆయన డెడ్‌బాడీ నేత్రావతి నదిలో దొరికింది. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ డెడ్‌బాడీని కనుగొన్నారు. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


షేరు డీలా ....దేశంలో అత్యధికంగా కాఫీ గింజలనుఎగుమతి చేసే వారిలోఆయన ఒకరు. 130 సంవత్సరాలకు పైగా సిద్ధార్థ కుటుంబం కాఫీ పండించే వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌లో 32.75 శాతం వాటాను సిద్ధార్థ కలిగి ఉన్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం క్రిష్ణకు స్వయానా అల్లుడు సిద్ధార్థ. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు.సిద్దార్థ మరణం వార్తలు అటు ఇన్వెస్టర్లను కూడా షాక్‌కు గురి చేశాయి.


దీంతో కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. భారీ అమ్మకాలతో షేరు 20శాతం నష్టాలతో లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. అంటే అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు లేకపోవడంతో రూ. 153.40 వద్ద ఫ్రీజయ్యింది. ఈ ఏడాది మార్చిలో టెక్‌ సంస్థ మైండ్‌ట్రీలో తనకున్న 20 శాతం మొత్తం వాటాను రూ. 3300 కోట్లకు ఎల్‌ అండ్‌ టీ కి విక్రయించి సిద్ధార్థ వార్తల్లో నిలిచారు. అలాగే 1993లో స్థాపించిన స్నాక్‌ ఫుడ్‌ కోలా జెయింట్‌ 1500 ఔట్‌లెట్లను విక్రయించడానికి కోకాకోలాతో చర్చలు జరిపినట్టు కూడా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే మైండ్‌ ట్రీ డీలే కొంపముంచిందా ? వంటి సందేహాలు మార్కెట్‌ వర్గాల్లో వ్యాపించాయి.

ఆయన మృతికి ఎవరు కారణం..?

 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ... సిద్ధార్థ మరణానికి కారణం ఎవరో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేపట్టాలని కోరారు.  

‘దేశవ్యాప్తంగా 1700 కాఫీడే అవుట్‌లెట్స్‌కు యజమాని అయిన సిద్ధార్థ మృతదేహం ఓ నదిలో లభించింది. ఆయన మృతికి ఎవరు కారణం..? మోదీ ప్రభుత్వమా? ఐటీ అధికారులా? లేదా ప్రైవేటు ఈక్విటీ భాగస్వాములా? దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టాలి. అందరు వ్యాపారవేత్తలూ దొంగలు కాదు’ అని నిరుపమ్‌ ట్వీట్‌ చేశారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: