ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు..! ప్రస్తుతం మార్కెట్లో ఇదే పరిస్థితి ఉంది. ఆకాశాన్నంటే నిత్యావసర సరుకుల ధరలు ఓ వైపు అయితే.. కొనకముందే కంటతడి పెట్టిస్తూ మండుతున్న కూరగాయల ధరలు మరోవైపు సామాన్యుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కరవు ప్రభావంతో నిమ్మ సాగు తగ్గడంతో మార్కెట్ లో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.  
ప్రస్తుత దినసరి వంటకాల్లో నిమ్మ నిత్యావసర వస్తువుగా మారింది. ప్రతి ఇంట్లో నిమ్మకాయలు ఉండాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నిమ్మకాయల ధరలు  పలుకుతున్నాయి. 80 కేజీల లూజు బస్తా 15 వేలకు చేరుకుంది. 2008లో గరిష్టంగా లూజు బస్తా ధర 8వేలు పలుకగా.. ఇప్పుడు ఏకంగా 15 వేలకు చేరుకుంది. దీంతో మార్కెట్‌లో జత నిమ్మకాయలు పది రూపాయలు పలుకుతున్నాయి.  


సాధారణంగా నిమ్మ సాగు నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. మెట్ట ప్రాంతాలైన వెంకటగిరి, ఉదయగిరి, గూడూరు నియోజకవర్గాల పరిధిల్లోని వాతావరణ పరిస్థితుల ప్రభావంతో.. అక్కడ 50 వేల హెక్టార్లలో పంట సాగువుతున్నట్లు అధికారుల అంచనా. ఇక్కడ సాగయ్యే.. నిమ్మకాయలను చెన్నై, కోల్ కతా, బెంగుళూరులతో పాటు తిరుపతి, నెల్లూరు, విజయవాడ నగారాలకు తరలిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నిమ్మ మార్కెట్ గూడురులో ఉండటంతో.. జిల్లాలోని నిమ్మ రైతులు ఇక్కడే పంటను అమ్ముతారు. చాలాకాలంగా గిట్టబాటు లేని నిమ్మ రైతులకు.. ప్రస్తుత ధరలు కొంత ఊరటనిస్తున్నాయి. కానీ, కరువు తాండవించడంతో.. భూగర్భ జలాలు సైతం ఎండిపోవడంతో 30 శాతం మేర పంటలు పాడైపోయాయి.


మరోవైపు, ఏడాదికి రెండు సార్లు చేతికోచ్చే ఈ పంటతో.. గత ఐదేళ్లలో రైతులను పెద్ద ఎత్తున దోచుకున్నారు దళారులు. అయితే ఈ సారి మాత్రం నిమ్మ పంట రైతు కంటతడిని తుడిచిందనే.. చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్లో లూజు బస్తా ధర పదమూడు వేల నుంచి పదిహేను వేల వరకు పలుకుతుంది. దీంతో.. 2015 నుంచి అవస్థలు పడ్డ రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద.. ఇన్నాళ్లూ నష్టాలతో కాలం వెళ్లదీసిన నిమ్మ సాగు అన్నదాతలు.. దిగుబడి తగ్గడంతో వచ్చిన కొద్ది పాటి పంటకు మంచి ధర వస్తుందంటున్నారు. వినియోగదారులు మాత్రం నిత్యం ఉపయోగించే నిమ్మ ధరలు ఆకాశాన్నంటడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: