ఉల్లి ఉరిమురిమి చూస్తోంది. ఏకంగా వంద రూపాయల మార్కు దాటేసి బస్తీమే సవాల్‌ అంటోంది. దీంతో ఉల్లిగడ్డ బంగారంలా మారిపోయింది. ఫలితంగా పలుచోట్ల దొంగలు బయలుదేరారు. ఉల్లిగడ్డల్ని కొల్లగొడుతున్నారు.

 
దేశవ్యాప్తంగా ఉల్లిధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రధాన నగరాల్లో కిలో ఉల్లిగడ్డ వందరూపాయలు దాటి పలుకుతోంది. ఈపరిణామం పేద, మధ్యతరగతి ప్రజలపై పెను ప్రభావం చూపిస్తోంది. దీంతో కిలో ఉల్లిపాయలు కొనే వినియోగదారు... ఇప్పుడు కేవలం పావుకిలోతో సరిపెట్టుకుంటున్న దుస్థితి దాపురించింది. ఉల్లి లేకుంటే ఇల్లు గడవదని, ఇంతలా ధరలు పెరిగితే ఎలా జీవితాలు సాగుతాయని మహిళలు ఆవేదన చెందుతున్నారు. 

 

డబ్బులు, బంగారం, వజ్రాలు, విలువైన వస్తువులు చోరీ కావడం చూస్తునే ఉంటాం.  కానీ ఇప్పుడు వాటి జాబితాలో ఉల్లిపాయలు కూడా చేరాయి.ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో దొంగలు పక్కన నగదు పెట్టెలు ఉన్నప్పటికీ వాటిని కనీసం తాకను కూడా తాకకుండా కేవలం ఉల్లిపాయలను మాత్రం దొంగతనం చేస్తున్న సంఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో దుండగులు 40 టన్నుల ఉల్లిపాయలు ఉన్న ట్రక్కును దొంగిలించారు. వాటి విలువ సుమారు 22 లక్షల వరకు ఉంటుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలో జరిగింది. ఇటు మరోచోట అయితే షాపులోకి దూరిన దుండగులు... డబ్బులు జోలికి వెళ్లకుండా ఉల్లిపాయలు దొంగతనం చేసుకుని వెళ్లిపోయారు. 

 

ఇదీ విషయం చివరకు ఉల్లి దొంగతనాలు చేసేవరకూ పరిస్థితి వెళ్లింది. మరోవైపు ఈ క్రైసిస్‌ నుంచి బయటపడేందుకు ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకోవడానికి యత్నిస్తోంది. డిసెంబర్‌ మొదటివారానికల్లా .. దేశానికి సరుకు చేరుకుంటుందన్నారు మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌. ఉల్లి ధరల అదుపునకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందంటున్నారు. మరోవైపు జార్కండ్‌ ఎన్నికలపై ఉల్లి ప్రభావం చూపుతుందా అన్న భయాలు .. బీజేపీని వెంటాడుతున్నాయ్‌. మొత్తానికి జనాలు ఉల్లి కొనాలంటేనే జంకుతున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ధరల తగ్గుదలకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఉల్లి ఉరుముతూనే ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: