దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ వల్ల వాణిజ్య సేవలు స్తంభించాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తుంటే మరికొన్ని కంపెనీలు వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామంటూ.... లాక్ డౌన్ అనంతరం వేతనాలు చెల్లిస్తామంటూ చెబుతున్నాయి. 
 
దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా ఆర్బీఐ మూడు నెలల మారిటోరియంను ఈ నెల తొలి రోజుల్లో విధించిన సంగతి తెలిసిందే. కానీ కరోనా వైరస్ ఉధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెడితే మాత్రమే వైరస్ అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 21,000 కు దాటగా మృతుల సంఖ్య 700కు చేరువలో ఉంది. అయితే ఆర్బీఐ మూడు నెలల మారిటోరియంను మరో మూడు నెలలు పొడిగిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
తాజాగా కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) కీలక సూచనలు చేసింది. కరోనా వల్ల కొన్ని రంగాలపై తీవ్రమైన ఆర్థిక భారం ఉందని... ఆర్థిక భారం తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలని పేర్కొంది. వన్ టైమ్ లోన్ రిస్ట్రక్చరింగ్, ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి ఉపశమనం కల్పించడం, మారటోరియం పెంపు వంటి సదుపాయాలను కల్పించాలని ఐబీఏ సూచనలు చేసింది. 
 
ఐబీఏ పరిశ్రమ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయటంతో పాటు కొన్ని సూచనలను ఇచ్చింది. ఐబీఏ గతంలోనే మారటోరియం పీరియడ్ ను ఆరు నెలలకు పెంచాలని కోరిందని ఎస్‌బీఐ చైర్మన్ రజ‌నీష్ కుమార్ తెలిపారు. మరోవైపు దేశంలో లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో జీడీపీ ఒకటి లేదా సున్నాగా నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కరోనా ఉధృతి మరికొన్ని రోజులు కొనసాగితే మాత్రం కేంద్రం మారటోరియం పీరియడ్ ఆరు నెలలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: