తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో కీలక రాజకీయ వ్యూహానికి తెర తీశారు. వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల జీవో విడుదల చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఇచ్చే జీవోను మోదీ అమలు చేస్తారా? లేకపోతే.. దాన్ని అడ్డుకుని ఉరితాడు చేసుకుంటారా అన్నది తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ అంటున్నారు. గిరజనుల రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి మొర పెట్టుకుని విసిగి వేసారి పోయామంటున్న సీఎం కేసీఆర్.. ఇకపై 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్రమే అమలు చేసుకుంటుందని తెలిపారు.


అంతే కాదు.. దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకం అమలు చేస్తామంటూ సీఎం కేసీఆర్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఈ గిరిజన బంధు పథకాన్ని తన చేతుల మీదుగా ప్రారంభిస్తానన్న కేసీఆర్.. భూములు లేని గిరిజనులకు పోడు భూములు పంచుతామన్నారు. అలాగే భూములు లేని గిరిజనులను గుర్తిస్తామని.. అలాంటి వారికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు ద్వారా భూమి లేని గిరిజనులకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.


సంపద పెంచడం పేదలకు పంచడమే తమ సిద్ధాంతమంటున్న సీఎం కేసీఆర్‌.. వీలైనంత వరకూ సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు. గిరిజనులను ఆదుకోవాలన్న లక్ష్యం మంచిదే.. అయితే.. ఇలా రాష్ట్రాలు రిజర్వేషన్లను ప్రకటించడం రాజ్యాంగ రీత్యా కుదరని వ్యవహారం.. రాష్ట్రాలు చేసిన ఈ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలి. పార్లమెంటులో చట్టం చేయాలి. అలా చేయకపోతే.. ఈ రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే.. కోర్టులు కొట్టేయడమో.. కేంద్రం అభిప్రాయం తీసుకోవడమో జరుగుతుంది.


గతంలోనూ చంద్రబాబు ఓసారి ఎస్సీ వర్గీకరణ కోసం జీవో తెచ్చి కొన్నాళ్లు అమలు చేశారు కూడా.. కానీ.. ఆ తర్వాత కోర్టు దాన్ని కొట్టేసింది. అందువల్ల ఇప్పుడు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అంటూ కేసీఆర్ ఇచ్చే జీవో భవిష్యత్‌ కూడా గందరగోళంలో పడే అవకాశం ఉంది. అయితే.. దీనికి కేంద్రం కూడా ఒప్పుకుంటే.. రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుంది. మరి కేసీఆర్‌ ఎత్తుకు మోడీ ఎలాంటి పై ఎత్తు వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: