అవును తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జగన్మోహన్ రెడ్డి పన్నిన ఉచ్చులో చంద్రబాబునాయుడు పూర్తిగా ఇరుక్కుపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో తమ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి రికార్డుస్ధాయిలో మెజారిటి రావాలన్నది జగన్ ఆదేశం. ఆ ఆదేశాలు కాస్త 5 లక్షలని ఫిక్సయిపోయింది. జగన్ ఆదేశాలను చేరుకోవటంపైనే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలంతా తీవ్ర కృషిచేశారు. ఈ విషయాన్ని వైసీపీ ఏమీ దాచుకోలేదు. కాబట్టి వైసీపీ ప్రయత్నాలను భగ్నం చేయాలని చంద్రబాబు పెద్ద ప్లాన్ వేశారు. పార్లమెంటు నియోజకవర్గం మొత్తంమీద తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం మీద చంద్రబాబు అండ్ కో బాగా దృష్టిపెట్టారు. ఇక్కడ చంద్రబాబు అధికారపార్టీ ఉచ్చులో ఇరుక్కుపోయిందట. విషయం ఏమిటంటే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎరేసి మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ దుమ్ము దులిపేసింది.




ఇటు టీడీపీ, అటు బీజేపీ దృష్టంతా తిరుపతిపైనే ఉంటుందని జగన్ అండ్ కో గ్రహించారు. అందుకనే ఉదయం నుండే తిరుపతి పరిధిలో కాస్త హడావుడి చేశారు. ఈ హడావుడి చూసి టీడీపీ, బీజేపీలోని మెజారిటి నేతలు తిరుపతిలోనే ఆందోళనలు మొదలుపెట్టారు. ఇదే అదునుగా చేసుకుని మిగిలిన శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, సూళ్ళూరుపేట, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో పోలింగ్ ను వైసీపీ నేతలు దున్నేశారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలైన సత్యవేడు, సూళ్ళూరుపేట, గూడురులో పోలింగ్ ఏకపక్షంగా జరిగింది. అందుకనే పై మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ 72 శాతం నమోదైంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో కూడా సగటు పోలింగ్ 70 శాతంగా నమోదైంది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2019 ఎన్నికలో 80 శాతం పోలింగ్ అయితే ఇపుడు 64 శాతమే నమోదైంది. అంటే తగ్గిన 16 శాతం పోలింగ్ అన్నీపార్టీలకు తగ్గినట్లే లెక్క. అయితే పోలైన 11 లక్షల ఓట్లలో తమకు పడిన ఓట్లు ఏమీ తగ్గలేదని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. తగ్గిన పోలింగ్ శాతమంతా టీడీపీకే మైనస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మూడు ఎస్సీ నియోజకవర్గాల్లోనే తమకు 1.5-2 లక్షల మెజారిటి వస్తుందని, మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో మరో 4 లక్షల మెజారిటీ ఈజీగా వస్తుందని అనుకుంటున్నారు. అంటే వైసీపీ లెక్కల ప్రకారం గురుమూర్తికి సుమారు 4.5 లక్షల నుండి 5 లక్షల మెజారిటి ఖాయమట. వైసీపీ ఉచ్చులో పడిన చంద్రబాబు అండ్ కో తిరుపతిని మాత్రమే పట్టించుకుని మిగిలిన ఆరు నియోజకవర్గాలపై దృష్టి పెట్టలేదట. దాంతో జగన్ టార్గెట్ రీచవటానికి అవకాశం వచ్చిందనేది ఓ అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: