కరోనా ఫస్ట వేవ్ సమయంలో ప్రజల లాక్ డౌన్ కష్టాలు తీర్చేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వలస కార్మికులకు సాయం చేస్తూ బిజీబిజీగా గడిపారు. ఊరూరా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు, కూరగాయలు, నిత్యావసరాలు అందించారు. బహుశా స్థానిక ఎన్నికల సమయం కావొచ్చు.. అనుకున్నదానికంటే ఎక్కువగానే పేదలకు సాయం చేశారు. అందరి మెప్పు పొందారు. ఇప్పుడు సెకండ్ వేవ్ సమయానికి నేలతంతా ఎక్కడికక్కడ గప్ చుప్. దాదాపుగా ఎమ్మెల్యేలెవరూ జనాల్లోకి రావడంలేదు. అటు అసెంబ్లీ లేకపోవడంతో బాగా ఖాళీ టైమ్ దొరికింది. అయినా సరే ఎమ్మెల్యేలెవరూ నియోజకవర్గాల్లో కనిపించడంలేదు. ఆమాటకొస్తే అసలు ఏపీలోనే లేరు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. ఇటు తమిళనాడు, కర్నాటక, అటు తెలంగాణ.. ఇలా దాదాపుగా ఎమ్మెల్యేలంతా పక్క రాష్ట్రాల్లోనే సెటిలయ్యారు.

నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బెంగళూరులో బిజినెస్ లు ఉన్నాయి. అడపాదడపా నియోజకవర్గానికి వస్తున్నా.. ఎక్కువ సమయం ఆయన కర్నాటకలోనే గడుపుతున్నారు. ఇక చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలలో సగం మందికి తమిళనాడులో వ్యాపారాలున్నాయి. హోటల్ బిజినెస్ లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ లతో వారంతా అక్కడ బిజీ. కోస్తా, రాయలసీమ ఎమ్మెల్యేలలో ఎక్కువమంది హైదరాబాద్ లో సెటిలయ్యారు. నియోజకవర్గాలకు ఎప్పుడో ఒకసారి మాత్రమే మొహం చూపిస్తున్నారు.

మంత్రులు ఇక్కడ.. ఎమ్మెల్యేలు అక్కడ..
కరోనా కష్టకాలంలో కూడా ఏపీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు ఆగలేదు కాబట్టి, మంత్రులు బిజీబిజీగా ఉన్నారు. నిత్యం సీఎం జగన్ తో జరిగే సమీక్షలకు హాజరవుతూ, ఇటు అధికారులను సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ కూడా లేకపోవడంతో తమ సొంత వ్యాపార కలాపాల్లో మునిగిపోయారు. పాఠశాలలు, కాలేజీలు మూతబడటంతో.. విద్యాలయాలు ఉన్నవారికి విశ్రాంతి దొరికింది. హోటల్స్, రియల ఎస్టేట్, కన్ స్ట్రక్షన్, కాంట్రాక్ట్ వర్క్ లు ఉన్నవారు ఇతర ప్రాంతాల్లో తమ బిజినెస్ లు రన్ చేస్తున్నారు. ఏపీలో ఆస్పత్రులు, ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం ఉన్నవారు ఇక్కడే వాటిని పర్యవేక్షిస్తున్నారు.


టీడీపీ హయాంలో ఏ పనులు జరగాలన్నా ఎమ్మెల్యేల చేతుల మీదుగానే సాగేవి. కానీ ఇప్పుడు ఆర్థిక సాయమైనా, ఆపద సాయమైనా నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోనే జమ అవుతోంది. దాదాపుగా ఎమ్మెల్యేలకు పనిలేకుండా చేసేశారు సీఎం జగన్. మూడో వ్యక్తికి తావులేకుండా, మధ్యవర్తిత్వం అసలే లేకుండా నేరుగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య బ్యాంక్ అకౌంట్ నే వారధిగా మార్చేసుకున్నారు జగన్. మీట నొక్కటం, అకౌంట్ లో డబ్బులు పడటం.. ఇలా అలవాటు చేసేశారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ సొంత వ్యాపకాల్లో మునిగిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: