ఏపీలో జిల్లాల పునర్వవ్యవస్థీకరణ ప్రతిపాదనను ఇటీవల కేబినేట్ ఆమోదించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఉన్న 13 జిల్లాల‌తో పాటు కొత్త‌గా మ‌రో 13 జిల్లాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్ర‌తి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లా చేస్తాన‌ని జ‌గ‌న్ గ‌తంలో చెప్పారు. అయితే అర‌కు పార్ల‌మెంటు జిల్లా పెద్ద‌దిగా ఉండ‌డంతో దానిని మ‌న్యం జిల్లాగా, అల్లూరి జిల్లాగా రెండుగా విభ‌జించారు. అయితే ఈ జిల్లాల విభ‌జ‌న అనేది అధికార పార్టీలోనే కొంద‌రికి మొదం.. కొంద‌రికి ఖేదంగా మారాయి. అస‌లు సొంత పార్టీలోనే చాలా మంది ఎగ‌స్పార్టీగా మార‌డంతో ఇబ్బందులు ప‌డుతోన్న చిత్తూరు జిల్లా న‌గ‌రి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, వైసీపీ లేడీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే. రోజా ఇప్పుడు జ‌గ‌న్ చేసిన జిల్లాల విభ‌జ‌న‌తో స‌రికొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉగాది లోగా కొత్త జిల్లాల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని చోట్ల ఇప్పటికే ఆందోళన మొదలవ్వ‌డంతో వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి కేంద్రంగా ఏర్పాట‌య్యే బాలాజీ జిల్లా పేరు మార్చాల‌న్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా న‌గ‌రిని చిత్తూరు జిల్లాలో క‌లిపారు. ఈ జిల్లాలో ఉన్న న‌గ‌రిని బాలాజీ జిల్లాలో క‌ల‌పాలన్న డిమాండ్లు అక్క‌డ వినిపిస్తున్నాయి. ఇందుకోసం అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేసి ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేస్తామ‌ని అక్క‌డ అంబేద్క‌ర్ యువ‌జ‌న సంఘాలు ఫైర్ అవుతున్నాయి.

తాజాగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ జ‌నాలు మాట్లాడుతూ కూత‌వేటు దూరంలో ఉన్న తిరుప‌తిని కాద‌ని.. ఎక్క‌డో ఉన్న చిత్తూరు జిల్లాలో న‌గ‌రిని క‌ల‌ప‌డం ఏంట‌ని వారు ఫైర్ అవుతున్నారు. తాము వివిధ అవ‌స‌రాల కోసం, జిల్లా కేంద్రంలో ప‌నుల కోసం తిరుప‌తి వెళ్ల‌డానికి వీలుగా ఉంటుంద‌ని.. అంతేకాని చిత్తూరు వెళ్ల‌డం త‌మ‌కు చాలా ఇబ్బంది అవుతుంద‌ని వారు చెపుతున్నారు. బ్రాహ్మ‌ణ‌ప‌ట్లు గ్రామ పొలిమేర్ల‌లోనే తిరుచానూరు ఉంద‌ని.. అక్క‌డ ప్ర‌జ‌లు చిత్తూరు ఎలా ?  వెళ‌తార‌ని కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రికొంద‌రు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న పుత్తూరు టౌన్‌ను బాలాజీ జిల్లాలో క‌ల‌పాల‌ని కోరుతున్నారు. ఈ మేర‌కు పుత్తూరు మున్సిప‌ల్ స‌మావేశంలో ఏక‌గ్రీవ తీర్మానం కూడా జ‌రిగింది. నియోజ‌క‌వ‌ర్గం అంతా పూర్తిగా తుడ ప‌రిధిలో ఉన్నందున పాల‌న‌, అభివృద్ధి కోసం బాలాజీ జిల్లాలో క‌ల‌పాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. న‌గ‌రికి చిత్తూరుకు సంబంధం ఉండ‌ద‌ని కూడా వారు చెపుతున్నారు. ఈ ఆందోళ‌న‌లు ఇక్క‌డ స్థానిక ఎమ్మెల్యే రోజాకు చుట్టుకుంటున్నాయి. ఆమె ఎలా స్పందిస్తుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: