మొన్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నిర్వహిణ గురించిన సమావేశంలో చంద్రబాబుతో ప్రధాని మోదీ ఓ ఐదు నిమిషాలు మర్యాద పూర్వకంగా మాట్లాడారు. అయితే.. దీన్ని టీడీపీ అనుకూల మీడియా బాగా హైలెట్ చేసింది. ఆహా.. ఓహో అంటూ.. అదరగొట్టింది. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఊహించి రాసేసి శభాష్ బాబు అంటూ యథాప్రకారంగా వార్తలు వండి వార్చింది.


అయితే.. ఈ తీరును వైసీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. అలా చెప్పుకోవాలంటే జగన్ తో ప్రధాని నిన్న డిన్నర్‌ టేబుల్‌పై గంటసేపు చర్చించారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ.. అలాంటివి జగన్ చెప్పుకోరని.. వాటిని ప్రచారానికి వాడుకోరని వైసీపీ నేతలు చెబుతున్నారు. నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సీఎం జగన్ డిన్నర్‌ చేశారు. ఆ టేబుల్‌పై కూర్చునే అవకాశం కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులకే వచ్చిందట.


ఆ సమయంలో గంటకు పైగా అనేక అంశాలపై ప్రధాని, జగన్ మధ్య చర్చ జరిగిందట. అయినా జగన్‌ దాన్ని ఎక్కడా ప్రస్తావించ లేదని.. దాన్ని ప్రచారమూ చేసుకోలేదని.. వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు విపరీతంగా అభద్రతా భావం ఏర్పడం వల్లే మోదీ పలకరింపులంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ, వ్యవసాయానికి ప్రాధాన్యంపై సీఎం జగన్ నీతి ఆయోగ్ మీటింగ్‌లో వివరించారని వైసీపీ నేతలు అంటున్నారు.


రాష్ట్రం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు అన్నింటినీ నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో జగన్ వివరించారట. జగన్ ప్రసంగానికి ప్రశంసలూ లభించాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. సీఎం జగన్‌కు ప్రచారం మీద యావ ఉంటే.. ప్రధానితో కలిసి లంచ్‌ చేసిన  ఫోటోలు, వీడియోలు చూపి  ప్రచారం చేసుకోవచ్చని.. కానీ తాము చంద్రబాబు మాదిరిగా ప్రచారాన్ని నమ్ముకోలేదని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ కేవలం ప్రజలను నమ్ముకుందని గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: