ఎర్ర సముద్రం.. ప్రపంచ నౌకా రవాణా రంగంలో అత్యంత కీలక మార్గం. ఈజిప్టులోని సూయోజ్ కాలువ మీదుగా ఈ మార్గాన్ని షిప్పింగ్ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి. మధ్యధరా సముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గరి మార్గం. ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ, తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇప్పుడీ మార్గం ప్రమాదంలో పడింది. యెమెన్ కేంద్రంగా హౌతీ రెబల్స్ సరకు రవాణా నౌకలపై దాడులకు దిగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.


నౌకా రంగంలో హిందూ మహా సముద్రం కీలకపాత్ర పోషిస్తోంది. దీనికి మలక్కా, హోర్మూజ్, బాబ్ ఎల్-మండెప్ జల సంధులు అత్యంత కీలకం. ప్రపంచంలోని 40శాతం చమురు ఈ 3 జలసంధులు మీదుగానే వెళ్తోంది. ఈ మార్గాలకు అడ్డంకులు సృష్టించడం ఆందోళనకరమే. హౌతీ దాడులతో బెంబేలెత్తిన షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. బాబ్ ఎల్ –మండెప్ మార్గంలో నౌకలను తిప్పబోమని ప్రకటించాయి.


ఇది 10శాతం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. ఎర్ర సముద్రం మీదుగా 35శాతం రవాణాను ఆపేశాయి. మార్క్స్, ఎంఎస్సీ, హపాగ్ లాయిడ్ కంపెనీలు రవాణాను నిలిపివేశాయి. బీపీచమురు కంపెనీ రవాణాను ఆపేసింది.  ప్రపంచ వాణిజ్యంలో 80శాతం నౌకల ద్వారానే జరుగుతుంది. భారత్ కు అది 95శాతం. వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడీపీలో 16శాతం.


అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌక కావడంతో అధిక రవాణా దీని ద్వారా జరుగుతోంది. దుస్తుల నుంచి కార్లు, చమురు, గ్యాస్ కు నౌకలే ఆధారం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక నౌకా రవాణా వ్యయం పెరిగింది. 40 అడుగుల కంటైయినర్ ధర 5శాతం పెరిగింది. ఏడాదికి 19000 నౌకలు సూయోజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. ఆసియా దేశాలు, ఈజిప్టు, ఈశాన్య ఐరాపాకు భారత్ నౌకల ద్వారానే సరకు రవాణా చేస్తోంది. దీంతో నౌకా సిబ్బందిలో భారతీయులే అధికం. ఎర్రసముద్రంలో సుదీర్ఘకాలం రవాణాకు అంతరాయాలు ఏర్పడితే 2024లో చమురు ధరలు పెరగడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: