గర్భధారణ టైంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా చేతులు, కాళ్లలో వాపు కనిపిస్తుంటుంది. శరీరంలో ద్రవం చేరితేనే ఇలా జరుగుతూ ఉంటుంది. వైద్య భాషలో దీనినే ఎడెమా అని వైద్యులు పిలుస్తారు. ఎడెమా వల్ల బాడీలోని కొన్ని భాగాలు ఉబ్బుతాయి. పాదాలు, చీలమండలు, చేతులలో వాపు కనిపించడం సాధారణం. దీనివల్ల కొన్ని సార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గర్భిణులకు ఇది అసౌకర్యంగా కూడా అనిపిస్తుంటుంది. గర్భిణులు శిశువును, మావిని ఉత్పత్తి చేయడానికి వారికి ఎక్కువ ద్రవంతో పాటుగా రక్తం కూడా ఎక్కువగా అవసరం అవుతుంది. ఆ ప్రక్రియలో ద్రవం, రక్తం కూడా శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది. వాటి పెరుగుదల వల్ల తల్లీ, బిడ్డా ఇద్దరికీ తగిన పోషకాహారం లభిస్తుంది. అయితే దీనివల్లే శరీరంలో నీరు కూడా బాగా చేరి పేరుకుపోవడం జరుగుతుంటుంది.

గర్భాశయం పరిమాణం కూడా పెరుగుతుంటుంది. అలా పెరిగే కొద్దీ బాడీలో అతిపెద్ద సిర అయిన వీనా కావా సిరపై కొంత మేర ఒత్తిడి కూడా పెరుగుతుంది. అది కాళ్ళ నుండి గుండెకు రక్తం వెళ్లకుండా చేయడంతో శరీరంలో ద్రవం స్టోర్ అయిపోతుంది. అంతేకాకుండా ఆహారం ద్వారా అందేటటువంటి సోడియంను న్యూట్రలైజ్ చేసే టైంలో నీటి నిల్వ జరిగి వాపు పెరుగుతుంది. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ వల్ల రక్తనాళాలు ఫ్లెక్సిబుల్‌గా మారి ద్రవం ఇతర కణాలలోకి వెళ్తుంది. దాని కారణంగా కూడా వాపు ఏర్పడటం గమనించవచ్చు.

అలాగే గర్భిణులు వాతావరణంలో ఉన్నా, ఎక్కువ సేపు కూర్చునే ఉన్నా లేదా నిలబడి ఉన్నా కూడా వాపు అనేది పెరుగుతుంది. అందుకే ఒకే భంగిమలో గర్భిణులు ఎక్కువ సమయం ఉండకూడదు. ఇలా వాపు తగ్గాలంటే తగినంత నీరు తాగాలి. రోజూ 10 గ్లాసుల వరకూ నీరు తాగితే మంచిది. తినే ఫుడ్‌లో ఉప్పు తగ్గించాలి. సోడియం ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. ఆకు కూరలు బాగా తీసుకోవాలి. వదులుగా ఉన్న బట్టలు వేసుకుంటే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాపు సమస్య తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: