
కివి పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని శాస్త్రీయ నామం ఆక్టినిడియా డెలిసియోసా. దీనిని చైనాలో 1904లో మొదటగా సాగు చేశారు. ఇది చూడటానికి గోధుమ వర్ణంలో ఉంటుంది. దీని పైన ఉండే వెంట్రుకల వంటి పొర కారణంగా చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ దీన్ని లోపల గుజ్జు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తినేందుకు చాలా రుచికరంగా, మధురంగానూ ఉంటుంది. కివి పండ్లలో పోషక విలువలు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
కివి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, అనేక రకాల వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని వల్ల చర్మం నిగనిగలాడుతుంది. కివి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
కివి పండులో ఉండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి, రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఈ పండులో పొటాషియం ఉండడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. కివి పండ్లలో కెరోటినాయిడ్స్, ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. కివి పండు తింటే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
కివి పండ్లను నేరుగా తినవచ్చు లేదా సలాడ్లు, స్మూతీలలో కలిపి తీసుకోవచ్చు. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కివి పండ్లను తినడానికి ముందు తప్పనిసరిగా శుభ్రం చేయాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు