మన రోజువారీ ఆహారంలో పండ్లు, పాలు, కూరగాయలు వంటి పోషకాహారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కానీ చాలామంది ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతుంటారు. అదేంటంటే – “ఏం తింటున్నాం” అన్నదానికంటే, “ఎప్పుడు తింటున్నాం” అన్నది మరింత కీలకం.సరైన సమయంలో తీసుకోని ఆహారం, ఎంత పోషకంగా ఉన్నా కూడా, శరీరానికి మేలు చేయకుండా సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం అయినా, ఆధునిక పోషకాహార శాస్త్రం అయినా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా మనం ప్రతిరోజూ తినే అరటిపండు విషయంలో సమయపాలన చాలా అవసరం.

ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఏమవుతుంది?

అరటిపండులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకున్నప్పుడు, రక్తంలో ఉన్న కాల్షియం–మెగ్నీషియం సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కొందరిలో అలసట, గుండె స్పందనలో అసమతుల్యత, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అలాగే, అరటిపండు పూర్తిగా తీపి పండు అయినప్పటికీ, ఖాళీ కడుపులో తీసుకుంటే జీర్ణవ్యవస్థపై అకస్మాత్తుగా ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

నారింజ, సిట్రస్ పండ్ల విషయంలోనూ జాగ్రత్త:

నారింజ, నిమ్మ, మోసంబి వంటి సిట్రస్ పండ్లలో సహజ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని పరగడుపున తినడం వల్ల కడుపులో మంట, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది.

ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా? :

ఆరోగ్యం కోసం అని చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటారు. కానీ గ్రీన్ టీలో ఉండే టానిన్లు జీర్ణరసాలపై ప్రభావం చూపి వికారం, తలనొప్పి, కడుపులో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అందుకే గ్రీన్ టీని తేలికపాటి అల్పాహారం తర్వాత తాగడం ఉత్తమం.

ఆహారం తీసుకునే సమయం ఎందుకు అంత ముఖ్యమంటే? :

మన శరీర జీవక్రియ సూర్యోదయంతో చురుకుగా ప్రారంభమై, సూర్యాస్తమయం తర్వాత నెమ్మదిస్తుంది. ఉదయం వేళలో శరీరం శక్తిని త్వరగా గ్రహించగలుగుతుంది. అందుకే ఉదయం పూట పండ్లు, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.రాత్రి వేళలో జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది కాబట్టి, భారమైన ఆహారాన్ని తప్పించి, పాలు వంటి శరీరానికి విశ్రాంతినిచ్చే పదార్థాలను తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తోంది.

సరైన సమయానికి ఆహారం తీసుకుంటే కలిగే లాభాలు:

సరైన సమయంలో సరైన ఆహారం తీసుకుంటే..పోషకాలు రక్తంలో త్వరగా కలిసి శరీరానికి సమర్థవంతంగా చేరుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. స్థూలకాయం, అలసట వంటి దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మంచిదే. కానీ దానిని ఎప్పుడు, ఎలా తింటున్నాం అన్నదే అసలైన విషయం. ఖాళీ కడుపుతో కాకుండా, అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో తీసుకుంటే అరటిపండు శరీరానికి పూర్తి ప్రయోజనం ఇస్తుంది.కాబట్టి ఇకనైనా ఆహారం విషయంలో కాస్త అవగాహన పెంచుకుని, సమయపాలన పాటిస్తే ఆరోగ్యం మీవైపే ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: