టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి, గత ఏడాది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పీరియాడికల్ మూవీ గా ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక దాని తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేయడానికి సిద్ధం అయిన మెగాస్టార్, కొన్నాళ్లుగా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా పూర్తిగా షూటింగ్స్ ని నిలుపుదల చేయడంతో ఆచార్య కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. 

IHG

ఇక ఇటీవల ఈ సినిమాతో పాటు తన ఫ్యూచర్ సినిమాల గురించి ప్రత్యేకంగా ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ఆచార్య ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుందని, అన్ని కలిసి వస్తే, వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేస్తాం అని అన్నారు. ఇక దీని తరువాత లూసిఫర్ రీమేక్ ని సుజిత్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని చెప్పిన మెగాస్టార్, దాని తరువాత యువ దర్శకుడు బాబీ, అలానే శక్తి దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నట్లు చెప్పారు. అయితే అవి ఇంకా ఫైనలైజ్ కాలేదని, అతి త్వరలో వాటి గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని మెగాస్టార్ అన్నారు. అయితే మెగాస్టార్ నోటి వెంట మెహర్ రమేష్ పేరు వచ్చినప్పటి నుండి కొందరు మెగా ఫ్యాన్స్ గుండెల్లో గుబులు మొదలైందట. తన కెరీర్ లో మొత్తం నాలుగు సినిమాలైన కంత్రి, బిల్లా, షాడో, శక్తి సినిమాలకు దర్శకత్వం వహించిన మెహర్ రమేష్, వాటిలో కేవలం బిల్లా సినిమాతో మాత్రమే విజయం అందుకోగా, మిగతా మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డాయి. దానితో మెహర్ రమేష్ కు ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. 

 

అటువంటి దర్శకుడితో ఇన్నేళ్ల తరువాత మెగాస్టార్ సినిమా చేయడానికి సిద్ధం అయ్యారంటే తమకు భయంగా ఉందని, తన కెరీర్ లో ఫ్లాప్ లే ఎక్కువ తీసిన మెహర్ రమేష్, మెగాస్టార్ సినిమాని కూడా సక్సెస్ చేయడం కష్టం అని, బాబోయ్ చిరంజీవి గారు మీకో నమస్కారం, దయచేసి అతడితో సినిమా ప్రయత్నం చేయవద్దని అభిప్రాయపడుతూ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మెహర్ రమేష్ మెగాస్టార్ కి బంధువని, అయినప్పటికీ కూడా ఇన్నేళ్ల వరకు అతడితో ఒక్క సినిమా కూడా చేయకుండా, ఇప్పుడు అతడితో సినిమా చేయడానికి మెగాస్టార్ ఒప్పుకున్నారు అంటే, అతడు చెప్పిన కథ, కథనాల్లో మంచి విషయం ఉండి ఉంటుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: