
తెలుగులో మధుబాబు షాడో నవలలు అంటే తెలియనివారుండరు. ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు ఆయన నవలలు తెలుగు నవలా ప్రపంచాన్ని ఏలాయి. షాడో అనే డిటెక్టివ్ సాల్వ్ చేసిన వరుస కేసులు సంబంధించి మధుబాబు అనేక నవలలు రాశారు. అయితే ఇప్పుడు నవలలు చదివే సమయం కూడా చాలామందికి ఉండడంలేదు. అందరూ ఈజీ వర్క్ కి అలవాటు పడి పోవడంతో ఈ నవలలని చదివే సమయం దొరకడం కష్టమే. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నవలలని ఆడియో ఫార్మాట్ లో మార్చి గానా డాట్ కాంలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రముఖ రేడియో జాకీ హేమంత్ ఆ పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు హేమంత్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.. మధు బాబు పక్కన కూర్చుని ఒక వీడియో బైట్ కూడా ఇప్పించారు. హేమంత్ త్వరలోనే ఇవన్నీ గానా శ్రోతల ముందుకు వస్తాయని ప్రకటించాడు. హేమంత్ ఒక పక్కన రేడియో జాకీగా పనిచేస్తూనే అనేక సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
నిజానికి ఈ షాడో నవలలను వెబ్ సిరీస్ తీస్తామంటూ గత ఏడాది ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర ఈ మేరకు అప్పట్లో ప్రకటించారు. అయితే ఆ తర్వాత వెబ్ సిరీస్ కాకుండా సినిమా చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని భావించి ఆ ప్రయత్నాలను కాస్త వాయిదా వేశారని ప్రచారం జరిగినా ఇప్పుడు అంత సినిమా ఊసూ లేదు మరో పక్క వెబ్ సిరీస్ ఊసూ లేకుండా పోయింది. దీంతో ఈ సమయంలో హేమంత్ ఈ ఐడియాతో ముందుకు రావడం కాస్త ఆనందించదగ్గ విషయమే.