ప్రకృతి విపత్తులు.. ప్రజల జీవితాలను సామూహికంగా కల్లోలం చేస్తాయి. వరదలు, వర్షాలు ముంచుకొచ్చినప్పుడు పేదా ధనిక తేడా ఉండదు.. గొడ్డూ గోదా కొట్టుకుపోతే బతుకు కష్టమై రోడ్డున పడాల్సి వస్తుంది ఎవరైనా.. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలోనే అందరికీ సామాజిక బాధ్యత ఉండాలి. ప్రస్తుతం రాయలసీమను వరదలు ముంచెత్తాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను వరదలు ఉప్పెనలా చుట్టుముట్టాయి. ఇక తిరుమల, తిరుపతిలోనైతే గతంలో ఎన్నడూ చూడని రీతిలో ప్రకృతి విరుచుకుపడింది.


వర్షాలు తగ్గి రెండు, మూడు రోజులైనా జనం చాలాచోట్ల వరదల్లో ఉన్నారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో కేవలం ప్రభుత్వం ఒక్కటే బాధితులను ఆదుకోలేదు. ప్రముఖులు, ధనికులు తాము సైతం ఆదుకునేందుకు ముందుకురావాలి. సహజంగా ఇలాంటి సమయాల్లో సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తుంటారు. తమ వంతు విరాళాలు, సంఘీభావం ప్రకటిస్తుంటారు. కానీ అదేం విచిత్రమో.. రాయలసీమను కనివినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తితే.. ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో టాలీవుడ్ ప్రముఖులెవరకూ స్పందించలేదు.


రాయలసీమ నేపథ్యంలో కొన్ని వందల సినిమాలు తెలుగు తెరను అలరించాయి. సీమ ఫ్యాక్షనిజం.. సీమ పౌరుషం అంటూ తమ సినిమాలకు ముడిసరుకుగా సీమను వాడుకున్నారు. కానీ.. ఇప్పుడు రాయలసీమకు కష్టం వస్తే మాత్రం ఒక్క హీరో కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చింది. సాధారణంగా సినీ హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు తిరుమల వెళ్తుంటారు. హిట్ కావాలని శ్రీవారిని మొక్కుతారు. అలాంటి తిరుమలకే కష్టం వచ్చినా ఒక్క హీరో కూడా ముందుకు రాలేదు.

 

అంతే కాదు.. ఇదే టాలీవుడ్ హీరోలు.. తెలంగాణలో హరిత హారం అంటూ ఓ ఎంపీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తే పోటీలు పడి మరీ పోస్టులు పెట్టారు. మేము సైతం అంటూ ముందుకొచ్చారు. అది తప్పేమీ కాదు.. అలా చేయాలి కూడా. కానీ.. తెలంగాణ హరితహారం పై ఉన్న ప్రేమలో కాస్తయినా రాయలసీమ బాధితులపైనా ఉండాలి కదా.. హీరోలూ.. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: