సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించినప్పటికీ ఆయన కోరిక పూర్తిగా నెరవేరలేదు అని అంటారు. అక్కినేని నాగేశ్వరరావు ‘మనం’ సినిమాలా మహేష్ గౌతమ్ లతో కలిసి ఒక మూవీలో నటించాలి అన్నకోరికతో పాటు తన కెరియర్ లో 400 సినిమాలు నటించాలి అన్న ఈరెండు కోరికలు పూర్తికాకుండానే కృష్ణ మరణించారు.


కృష్ణ సినిమాలకు సంబంధించి ఆయన చివరి సినిమాగా ‘శ్రీశ్రీ’ మూవీ రికార్డులలో నిలిచింది. ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈమూవీకి మహేష్ బాబు వాయస్ ఓవర్ ఇచ్చాడు. ఈమూవీలో కృష్ణ పక్కన విజయనిర్మల నటించింది. ఈమూవీ అప్పట్లో సూపర్ ఫ్లాప్. అయితే సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా ఇది కాదు అని తెలుస్తోంది. ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ అన్న టైటిల్ తో ఒక మూవీ చాల సంవత్సరాల క్రితమే పూర్తి అయిందట.


అయితే కొన్ని కారణాలు వల్ల ఈమూవీని విడుదల చేయలేకపోయారు అని తెలుస్తోంది. ల్యాబ్ లో ఉండిపోయిన ఈమూవీకి ఇప్పుడు మోక్షం కలిగింది అన్నప్రచారం జరుగుతోంది. ఈమధ్య సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు తిరిగి రీ రిలీజ్ అయిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ మూవీకి మొదటిరోజు వచ్చిన కలక్షన్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడ షాక్ అయ్యాయి. ఈనాటితరం ప్రేక్షకులలో కృష్ణకు ఇంకా ఇంత ఇమేజ్ ఉందా అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు.


ఆవిషయాలను చూసి స్ఫూర్తి పొందిన నిర్మాత తాను గతంలో కృష్ణతో తీసి విడుదల చేయలేకపోయిన ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ మూవీని ఇప్పుడు విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీ విడుదల వెనుక సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉన్నాయా లేవా అన్నది స్పష్టత లేదు అని అంటున్నారు. మహేష్ కుటుంబ సభ్యులు కూడ ఊహించని స్థాయిలో ‘మోసగాళ్ళకు మొసగాడు’ మూవీ రీ రిలీజ్ సక్సస్ కావడం ఒకవిధంగా అనుకోని ఆనందాన్ని ఇచ్చింది అని అంటున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: