
షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరగకపోతే నటీనటుల డేట్లు పూర్తిగా మారిపోతాయి. ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ డేట్స్ మారితే మొత్తం షెడ్యూల్‌ని రీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. టెక్నీషియన్ల అందుబాటు చూసుకోవడం, మిగిలిన క్రాఫ్ట్ వర్కర్లను సమన్వయం చేయడం లాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆలస్యం కారణంగా బడ్జెట్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో క్వాలిటీకి పెద్ద పీట వేస్తున్న తరుణంలో, సమ్మె వల్ల కోల్పోయే సమయం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ప్రభావం చూపిస్తుంది.
ఈ బంద్ వల్ల ఆర్థికపరమైన నష్టమే కాకుండా, రిలీజ్ డేట్లు తప్పిపోవడం, డిస్ట్రిబ్యూషన్ ప్లాన్లు మారిపోవడం, ప్రమోషన్లపై ప్రతికూల ప్రభావం పడటం వంటి పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా, పండుగ సీజన్లు లేదా సెలవుల కాలాలను టార్గెట్ చేసిన సినిమాలు మిస్ అయితే కలెక్షన్లపై కూడా నేరుగా ప్రభావం పడుతుంది. ఏదేమైనా నిర్మాతలు, సినీ కార్మికుల ఫెడరేషన్ ప్రతినిధులు పరస్పర సమస్యలను అర్థం చేసుకొని చర్చల ద్వారా త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే ఇండస్ట్రీకి పెద్ద నష్టం కలిగే ప్రమాదం ఉంది.