జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ క్యాంప్ కార్యాలయం పై దాడి చేశారు. ఆదివారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ క్యాంప్ కార్యాలయం పై ఎన్టీఆర్ అభిమానులు దాడి చేయడంతో అక్కడ పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తికరంగా మారిపోయింది. మనందరికీ తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగులో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా, బాలీవుడ్‌లో మాత్రం సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాను కావాలనే కొంతమంది రాజకీయ రంగంలోకి లాగి కుట్ర చేసి ఫ్లాప్ చేశారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు.

దానికి తగ్గట్టే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ ఆడియో ఒకటి లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. “ఎవడు చూస్తాడు ఎన్టీఆర్ వార్ 2 సినిమాను” అంటూ ఎమ్మెల్యే హద్దులు మీరిన వ్యాఖ్యలు చేశాడని ఆడియో విన్న ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. ఆ ఆడియో బయటకు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే అభిమానుల డిమాండ్‌ను ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన క్యాంప్ కార్యాలయం పై దాడి చేశారు. అభిమానుల ఆందోళన పిలుపు నేపథ్యంలో అనంతపురం దగ్గుబాటి కార్యాలయం సమీపంలో భారీ బారికేడ్లు, చెక్‌పోస్టులు పెట్టినా కూడా అభిమానులు విధ్వంసం సృష్టించారు. పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అంటూ డిమాండ్ చేశారు.

పరిస్ధితి అదుపులోకి తీసుకురావడానికి అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం ఎన్టీఆర్ అభిమానుల నిరసనలతో మారుమ్రోగింది. ఈ సంఘటనల నేపథ్యంలో పోలీసులు హై సెక్యూరిటీ కల్పించారు. ఇప్పటికే దగ్గుబాటి పై సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించకపోవడంతో రకరకాల చర్చలు మొదలయ్యాయి. “జూనియర్ ఎన్టీఆర్ కావాలని రెచ్చగొడుతున్నారా..? సాధారణంగా అలాంటి వారు కాదు. మరి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు..?” అంటూ అనేక కామెంట్లు వస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారని, అందుకే ఈ విషయం గురించి పట్టించుకోవట్లేదని అభిమానులు అంటున్నారు. ఈ వివాదం సర్దుమనగాలంటే .. జూనియర్ ఎన్టీఆర్ స్పందించి “ఇలాంటివి ఆపేయండి” అని అభిమానులకు పిలుపు ఇవ్వాలి లేక టిడిపి ఎమ్మెల్యే బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పాలి. ఈ రెండింట్లో ఏదో ఒకటి జరిగితే కానీ పరిస్థితి సర్దుమనగదని సినీ ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: