- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్‌లో వెలుగుల వెనక ఉంటే చీకట్లు ఎంత ఘోరంగా ఉంటాయో బయటకి తెలియదు. సినిమా ఇండస్ట్రీ అనగానే బయటివారికి మెరిసే పోస్టర్లు, కోట్ల రూపాయల బడ్జెట్లు, స్టార్ హీరోల హంగామా కనిపిస్తుంది. కానీ ఈ మెరుపుల వెనక నిజం మాత్రం పూర్తిగా వేరే ప్రపంచం. కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులు ఈ వాస్తవాన్ని మరోసారి బయటపెడుతున్నాయి. పేరు, పబ్లిసిటీ, భారీ ప్రాజెక్టులు ఉన్నా… ఆర్థికంగా వణుకుతున్న టాలీవుడ్ టాప్ నిర్మాతలు తక్కువేమీ కాదు. ఇండస్ట్రీలో అత్యంత పెద్దదిగా పేరున్న ఒక నిర్మాణ సంస్థ పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా ఉందని టాక్. చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ, వాటిలో పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్టులు ఉన్నా.. వాస్తవానికి ఆ సంస్థపై ఉన్న అప్పుల భారమే ఎక్కువుగా ఉంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


ఫైనాన్స్ ద్వారా తీసుకున్న అప్పులపై నెలకు దాదాపు రు. 10 కోట్ల వరకూ వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తోందట. ఇది ఏ కంపెనీకైనా చిన్న విషయం కాదు. సంవత్సరానికి చూస్తే రు. 120 కోట్లు కేవలం వడ్డీ కోసమే వెళ్లిపోతున్నాయి.
దీనికి తోడు నెలవారీ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, కార్యాలయ నిర్వహణ అన్నీ చూస్తే సంవత్సరానికి కనీసం రు. 200 కోట్లు కావాల్సిన పరిస్థితి. అంత పెద్ద ఆదాయం రాబట్టాలంటే ఏ స్థాయి సినిమాలు తీసినా గ్యారంటీ లేదు. ఓ సినిమా ఫ్లాప్ అయితే వచ్చే నష్టం మ‌రింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది.  అందుకే ఆ సంస్థ నిర్మించిన సినిమాలు త్వరగా పూర్తై, ఓటిటి డీల్స్ రూపంలో వచ్చే డబ్బులు తిరిగి చక్రం తిప్పాలని ఆశగా ఎదురు చూస్తున్నారట.


ఇలాంటి పరిస్థితి మరో బ‌డా నిర్మాణ సంస్థ దగ్గర కూడా కనిపిస్తోంది. వరుసగా పలు భారీ సినిమాలు నిరుత్సాహకరమైన ఫలితాలు ఇవ్వడంతో అప్పులు ఒక్కొక్కటిగా పెరిగాయి. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు అడ్వాన్స్‌లు ఇవ్వాలంటే కొత్త ఫైనాన్స్ చూడాల్సిన స్థితి. వడ్డీగా నెలకు దాదాపు రు. 5 కోట్ల వరకు చెల్లిస్తుండటంతో, నిర్మాతలపై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు ఈ రెండు సంస్థలకి ఇప్పుడు ఒకటే మార్గం ముందు ఉంది. వరుసగా రెండు మూడు భారీ హిట్లు పడాలి. హిట్స్ వస్తేనే డబ్బు ప్రవాహం పెరుగుతుంది, అప్పులు తగ్గుతాయి, నిర్మాతలు ఊపిరి పీలుస్తారు. లేదంటే ఈ మెరిసే పరిశ్రమలో వెనక ఉన్న ఆర్థిక ఇబ్బందులు వారిని మ‌రింత నిండా ముంచేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: