తాజాగా జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నటుడు ధనుష్ తన కెరీర్‌లో సంచలనంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టిన ‘వై దిస్ కొలవరి డీ’ పాట గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పాట ఎలా పుట్టింది, అది వారి జీవితాలను ఎలా మార్చింది అనే విషయాలను గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కేంద్రబిందువుగా మారాయి. ధనుష్ మాట్లాడుతూ..“మేము ఈ పాటను అసలు సీరియస్‌గా చేయలేదు. పూర్తిగా సరదాగా, జోక్‌గా ఈ పాటను రికార్డ్ చేశాము. కొంచెం పని చేసి, అలాగే పక్కన పెట్టేశాం. ఆ తర్వాత ఈ పాట గురించి పూర్తిగా మర్చిపోయాం. ఒకరోజు మళ్లీ దానిని ప్లే చేసి చూస్తే, అది అద్భుతంగా ఫన్నీగా అనిపించింది. మా మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడూ ఫన్నీ ఐడియాస్‌తో పని చేస్తాడు. కాబట్టి ‘దీనిని ఒకసారి ట్రై చేద్దాం’ అనుకున్నాం.”


“ఈ పాటకు నేను ఎప్పుడూ అంత పెద్ద రేంజ్‌లో స్పందన వస్తుందని అసలు ఊహించలేదు. నాకు అనిపించింది  తమిళనాడులో కొంతమందికి నచ్చితే చాలు అనిపించింది. తమిళం ప్రపంచంలోని అత్యంత పురాతన భాషలలో ఒకటి, కానీ ఈ పాట మాత్రం తమిళంలో లేదు… తంగ్లిష్‌లో ఉంది. అందుకే ఇది ఎంతదూరం వెళ్తుందో నాకు కూడా అర్థం కాలేదు.” అని చెప్పుకొచ్చారు. వైరల్ అయిపోయిన తరువాత ధనుష్‌కు ఈ పాట నుంచి తప్పించుకోవడం కష్టమైందని ఆయన నవ్వుతూ మాట్లాదుతూ..
“ఈ పాట నుంచి నేను ఎంత పారిపోయినా, అది నన్ను వెంబడిస్తూ వచ్చింది.

 

ఇప్పటికీ నేను దానికి ఓడిపోతూనే ఉన్నాను. ఇది వైరల్ మార్కెటింగ్‌ను నిజంగా తిరిగి నిర్వచించిన పాట. ప్రపంచవ్యాప్తంగా మనల్ని అందరికీ పరిచయం చేసింది.” అయితే ఈ విజయంతోపాటు కొన్ని అనుకోని ఒత్తిడులు కూడా ఎదురయ్యాయి.. “ఒక విధంగా చూసుకుంటే ఈ పాట మా టీమ్‌కు వరమైతే, మరొక విధంగా ఇది ఒక శాపంలా కూడా మారింది. ఈ పాట ఎప్పుడూ మా చుట్టూ తిరుగుతూనే ఉంది. దాన్ని మించేలా ఏదైనా క్రియేట్ చేయడం చాలా కష్టం అయిపోయింది.” అని చెప్పుకొచ్చారు. ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ పాట 2011లో విడుదలైనప్పటి నుంచే భారతదేశమే కాక ప్రపంచమంతా దాని తాలూకు మంత్రానికి లోనైంది. యూట్యూబ్‌లో మొదటి మిలియన్ వ్యూస్‌ను అత్యంత వేగంగా సాధించిన భారతీయ వీడియోల్లో ఇదొకటి. సోషల్ మీడియా విస్తృత స్థాయిలో విపరీతంగా పాపులర్ కావడానికి ఇది మార్గం సుగమం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: