నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'అఖండ 2: ది తాండవం' విడుదల ఆకస్మికంగా వాయిదా పడటం తెలుగు సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ తీవ్ర నిరాశను నింపింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా, చివరి నిమిషంలో నిలిచిపోయింది. ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులకు నిరాశ కలిగించినా, అమెరికా (USA) మార్కెట్‌పై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతోందనే వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో అమెరికా ప్రీమియర్స్ కలెక్షన్స్ అత్యంత కీలకం. విడుదలకు ఒక్కరోజు ముందు సినిమా వాయిదా పడటంతో అక్కడ ఎన్నో థియేటర్లలో ప్రీమియర్ షోల కోసం చేసిన అడ్వాన్స్ బుకింగ్‌లు రద్దయ్యాయి.

యుఎస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ వాయిదా కారణంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే సినిమా హక్కుల కొనుగోలు, థియేటర్ అగ్రిమెంట్లు, ప్రచార కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. దీనికి తోడు, ప్రీమియర్ షోల కోసం అమ్ముడైన టికెట్లకు రిఫండ్‌లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

యుఎస్ డిస్ట్రిబ్యూటర్... 'అఖండ 2' చిత్రం కోసం తాము చెల్లించిన 11 కోట్ల రూపాయల పంపిణీ మొత్తాన్ని (Refund) తక్షణమే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. తెలుగు సినిమాకు అతిపెద్ద ఓవర్సీస్ మార్కెట్ అయిన అమెరికాలో ఇలాంటి పరిణామాలు జరగడం పంపిణీదారులను ఆర్థికంగా దెబ్బతీస్తుంది.

ఈ అనూహ్య వాయిదా కేవలం ఆర్థిక సమస్యలను మాత్రమే కాక, సినిమాపై ఉన్న అంచనాలను (Hype) కూడా తగ్గించే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల వాయిదా పడటానికి ఆర్థిక వివాదాలు, మద్రాస్ హైకోర్టు నుండి వచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా, అతి తక్కువ వ్యవధిలో విడుదల ఆగిపోవడంతో అఖండ 2 టీంపై, ముఖ్యంగా నిర్మాతలపై అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరించుకుని కొత్త విడుదల తేదీతో వస్తామని నిర్మాణ సంస్థ హామీ ఇచ్చినా, ఈ ఆలస్యం సినిమా విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: