టాలీవుడ్‌లో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ స్వీటి, క్రమంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.అయితే అనుష్క కెరీర్‌కు అసలైన మలుపు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన ‘బాహుబలి’ సిరీస్‌తో వచ్చింది. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాలు అనుష్కను కేవలం టాలీవుడ్‌కే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. దేవసేన పాత్రలో ఆమె చూపించిన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాల తర్వాత అనుష్క కెరీర్ కొత్త పుంతలు తొక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


అయితే  తన సినీ జీవితంలో చేసిన ఒక పెద్ద తప్పు గురించి అనుష్క శెట్టి పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోతో చేసిన ఓ సినిమా తన కెరీర్‌లో అతిపెద్ద మిస్టేక్‌గా భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఆ సినిమా మరేదో కాదు… నందమూరి బాలకృష్ణ హీరోగా, వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్క మగాడు’. అనుష్క కెరీర్ ప్రారంభ దశలో ఈ సినిమాలో నటించింది. 2008 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఒక్క మగాడు’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ – వైవియస్ చౌదరి కాంబినేషన్ అప్పట్లో క్రేజీగా భావించబడింది. ఆ కారణంతోనే కథను పూర్తిగా వినకుండానే, తన పాత్రకు ఎంత స్కోప్ ఉంటుందో తెలుసుకోకుండానే ఈ సినిమాకు ఒప్పుకున్నానని అనుష్క స్వయంగా వెల్లడించింది.దురదృష్టవశాత్తు, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అంతేకాదు, ఈ సినిమాలో అనుష్క పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం ఆమెను నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా ఒక పాటలో బాలయ్యతో చేసిన అంగాంగ ప్రదర్శన కారణంగా అనుష్క అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ సన్నివేశం తనను చాలా అభాసుపాలు చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.



అయితే బాలకృష్ణతో కలిసి పనిచేయడం మాత్రం మంచి అనుభవమేనని అనుష్క చెప్పింది. కానీ కథ, పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోకుండా సినిమా ఒప్పుకోవడం తన కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నానని స్పష్టంగా పేర్కొంది. ఈ సంఘటన నుంచి తాను చాలా నేర్చుకున్నానని, ఆ తర్వాత సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని తెలిపింది. మరోవైపు, అనుష్క శెట్టి వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా అనుష్కప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పూటకో వార్త హల్‌చల్ చేస్తోంది. ‘బాహుబలి’ తర్వాత వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఇప్పటికీ బ్యాచిలర్స్ కావడంతో ఈ రూమర్స్‌కు మరింత క్రేజ్ పెరుగుతోంది.



వీరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే కానీ ఈ వార్తలకు చెక్ పడదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ రూమర్స్‌పై స్పష్టత వచ్చినా, మళ్లీ మళ్లీ అదే ప్రచారం కొనసాగుతూనే ఉంది. మరి ఈ పెళ్లి వార్తలపై ప్రభాస్ ఎలా స్పందిస్తాడో, అనుష్క ఏమంటుందో చూడాలి..?!

మరింత సమాచారం తెలుసుకోండి: