మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో, నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలై రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం సాధించిన ఘనవిజయంపై దర్శకుడు అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో తన సంతోషాన్ని పంచుకున్నారు.


పవన్ కళ్యాణ్ గారి అభినందనలు ఎలా అనిపించాయి.. ?
కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయనతో పాటు పరిశ్రమలోని ఇతర హీరోలు, దర్శకులు ఫోన్ చేసి ప్రశంసించడం విశేషం. మా సినిమా సక్సెస్‌ను ఇండస్ట్రీ అంతా తమ విజయంగా సెలబ్రేట్ చేసుకోవడం గొప్ప అనుభూతినిస్తోంది.
చిరంజీవి గారు, వెంకటేష్ గారిని ఒకే ఫ్రేమ్‌లో చూపించడంలో ఒత్తిడి అనిపించిందా.. ?
వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారంటే అంచనాలు భారీగా ఉంటాయి, వాటిని అందుకోవడం పెద్ద బాధ్యతే. కానీ వారిద్దరి మధ్య ఉన్న సహజమైన స్నేహం వల్ల నా పని సులువైంది. ప్రస్తుతం థియేటర్లలో వీరిద్దరి సీన్స్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.


సినిమాలో ప్రతి సీక్వెన్స్ అద్భుతంగా కుదిరింది కదా.. రైటింగ్ ప్రాసెస్ ఎలా సాగింది?
శంకర్ వరప్రసాద్ క్యారెక్టర్ జర్నీని ఒక ‘వన్ మ్యాన్ షో’లా చూపించాలనుకున్నాను. అందుకే ప్రతి సీన్‌ను ఆయన చుట్టూనే రాసుకున్నాను. అయితే, శశిరేఖ లవ్ ట్రాక్ ముందుగా స్క్రిప్ట్ మధ్యలో అనుకున్నాం. కానీ స్క్రీన్ ప్లే రాసేటప్పుడు అది ప్రారంభంలో ఉంటేనే కథకు మంచి కనెక్టివిటీ ఉంటుందని మార్చడం జరిగింది. ఆ మార్పు సినిమాకు అద్భుతంగా వర్కౌట్ అయింది.
నయనతార గారు మీ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.. అది ఎలా సాధ్యమైంది?
ఆమెకు ఈ కథతో పాటు నా వర్కింగ్ స్టైల్ కూడా బాగా నచ్చింది. అందుకే చాలా పాజిటివ్‌గా స్పందించి ప్రమోషన్స్‌లో భాగమయ్యారు. సినిమా విడుదలయ్యాక ఆమెతో మాట్లాడాను. ఇంతటి భారీ విజయం సాధించినందుకు ఆమె ఎంతో సంతోషంగా ఉన్నారు.


యూఎస్‌లో కూడా సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా.. అక్కడికి టూర్ వెళ్లే అవకాశం ఉందా?
అవును, కచ్చితంగా వెళ్లాలి. ఈ నెల చివరలో లేదా ఫిబ్రవరిలో యూఎస్ వెళ్లి అక్కడి ప్రేక్షకులకు స్వయంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ‘F2’ నుండి నా వరుసగా ఐదు సినిమాలను అక్కడి వారు గొప్పగా ఆదరించారు. వారు చూపిస్తున్న ప్రేమకు ప్రతిఫలంగా అక్కడికి వెళ్లి ప్రేక్షకులను తప్పకుండా కలుస్తాను.
భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ గురించి మీ అభిప్రాయం.. ?
భీమ్స్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ సంతోషాన్నిస్తుంది. సినిమాకు ఎలాంటి సంగీతం కావాలో తనకి చాలా స్పష్టంగా చెప్పగలను, మా మధ్య ఆ ఫ్రీడమ్ ఉంది. ఒక పాట కోసం ఎన్ని వెర్షన్స్ అయినా చేయడానికి తను వెనకాడడు. ఈ సినిమా కోసం తను అహర్నిశలు కష్టపడ్డారు. భవిష్యత్తులో కూడా మా కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుంది.


మీరు బడ్జెట్ కంట్రోల్‌లో సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు?
సినిమాని ‘మనది’ అనుకుని బాధ్యతగా చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. నిర్మాత పెట్టే ప్రతి పైసాకు నేను కాపలాదారుడిలా ఉంటాను. షూటింగ్‌కు ముందే ప్రతి అంశాన్ని పేపర్ మీద పక్కాగా ప్లాన్ చేసుకోవడం వల్ల బడ్జెట్ నియంత్రణ తప్పుతుందన్న భయం ఉండదు. నిజానికి సినిమా బడ్జెట్ పెరగాలన్నా, తగ్గాలన్నా ఆ పగ్గాలు పూర్తిగా దర్శకుడి చేతిలోనే ఉంటాయి.
చిరంజీవి గారి మేనకోడలు ఈ సినిమాలో పాట పాడారు కదా? ఆ టాలెంట్ ని ఎవరు గుర్తించారు.. ?
సినిమా కోసం చిరంజీవి గారు ఇద్దరు అద్భుతమైన టాలెంట్స్‌ను పరిచయం చేశారు. ఒకటి ఆట సందీప్. తను గొప్ప మాస్టర్ అవుతారని చిరంజీవి గారు ముందే చెప్పారు, ఇప్పుడు తనకి మంచి పేరు వచ్చింది. రెండోది, చిరంజీవి గారి చిన్న చెల్లెలు మాధురి గారి అమ్మాయి. తను పాప్ మ్యూజిక్ కోర్స్ చేసింది. చిరంజీవి గారు తనతో పాట పాడించి, “మీకు నచ్చితేనే సినిమాలో పెట్టుకోండి” అని చెప్పారు. కానీ తను పాడిన విధానం చూసి మేమందరం ఆశ్చర్యపోయాము, తను నిజంగా అద్భుతమైన సింగర్.


రాజమౌళి గారితో మిమ్మల్ని పోల్చడంపై మీ స్పందన ఏంటి.. ?
వరుస విజయాల వల్ల ఆ పోలిక వచ్చి ఉండవచ్చు, కానీ దర్శకులుగా మా మధ్య పోలికకు అస్సలు ఆస్కారం లేదు. ఆయన చేసే సినిమాల శైలి వేరు, నా శైలి వేరు. దర్శకుడిగా ఆయన ఎంతో ఉన్నత శిఖరాల్లో ఉన్నారు, ఆయనే నాకు ఇష్టమైన దర్శకుడు. నేను ఇప్పుడే నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను, ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: