మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’తో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే 292 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో చిరు తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు బాబీ కొల్లితో మెగాస్టార్ మళ్లీ చేతులు కలుపుతున్నారు. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనుల కోసం ప్రస్తుతం చిత్ర బృందం దుబాయ్‌లో కసరత్తులు చేస్తోంది.


ఈ సినిమాలో నటీనటుల ఎంపికపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవికి జోడీగా సీనియర్ నటి ప్రియమణి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న మెగాస్టార్ భార్య పాత్రలో ఆమె కనిపించనున్నారని, ఇందుకోసం మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ పేరు వినిపించినా.. చివరికి ప్రియమణి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై కొత్త అనుభూతిని ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.


మరోవైపు ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ హైలైట్‌గా ఉండబోతోంది. చిరంజీవి కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కృతి శెట్టి ఈ పాత్రకు ఎంపికయ్యారని కొన్ని వర్గాలు అంటుంటే, ఆమెను ఇంకా సంప్రదించలేదని మరికొన్ని కథనాలు వస్తున్నాయి. బెంగాల్ లేదా కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ డ్రామాలో తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు కథకు ప్రాణమని, అందుకే ఆ పాత్ర కోసం సరైన నటిని ఎంపిక చేసే పనిలో బాబీ ఉన్నారని తెలుస్తోంది.


ఈ ప్రతిష్టాత్మక సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఫిబ్రవరిలో సినిమాను అధికారికంగా ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ లేదా థమన్ ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల జాబితాను చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: