వైవిధ్యమైన సినిమాలు, భిన్నమైన పాత్రలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న యువ హీరో నితిన్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది నితిన్ కెరీర్‌లో 36వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి వెర్సటైల్ డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించనుండగా, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా అధికారికంగా ప్రకటించారు. విభిన్నమైన కథలు, కొత్త కథన శైలితో ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ వచ్చే దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఈ ప్రాజెక్ట్‌తో మరోసారి తన క్రియేటివ్ బౌండరీలను మరింత విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

‘ఊరు పేరు భైరవకోన’ సినిమా తర్వాత వి.ఐ. ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ హై కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్, కాన్సెప్ట్— కలిపి ఈ సినిమా నితిన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఇదిలా ఉండగా, ఇటీవల ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ నుంచి నితిన్ తప్పుకున్న విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఆ ప్రాజెక్ట్ వదులుకున్నందుకు కొంతమంది నెటిజన్లు నితిన్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ భారీ సై-ఫై సినిమా అనౌన్స్ కావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. “ఎల్లమ్మ ప్రాజెక్ట్ పోతే ఏముంది… దానికంటే పెద్ద ఆఫర్ దక్కింది” అంటూ నితిన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

మొత్తానికి, కథ ఎంపిక విషయంలో ఎప్పుడూ కొత్తదనం కోరుకునే నితిన్ మరోసారి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడని, ఈ సినిమా ఆయన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: