కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ, కొత్త ఆలోచనలతో సినిమాల నిర్మాణంలో తనదైన ముద్ర వేసుకున్న నిర్మాత అనిల్ సుంకర మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇప్పటివరకు విభిన్నమైన కథాంశాలు, వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, తాజాగా ప్రకటించిన మూవీ మేకింగ్ రియాలిటీ షో ‘షో టైమ్ – సినిమా తీద్దాం రండి’తో సినీ వర్గాల్లోనే కాకుండా క్రియేటివ్ కమ్యూనిటీల్లోనూ విశేషమైన స్పందనను సొంతం చేసుకున్నారు. టాలెంట్ ఉన్న యువతకు సరైన వేదిక కల్పించాలన్న స్పష్టమైన లక్ష్యంతో రూపొందిన ఈ ప్రాజెక్ట్, అనిల్ సుంకర విజన్‌ను మరింత బలంగా చాటిచెప్పింది.

ఈ క్రమంలోనే ఆ విజన్‌ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ, ఏటీవీ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై కొత్త నటీనటులతో తెరకెక్కనున్న ఫీచర్ ఫిల్మ్ ‘ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్’ను అధికారికంగా ప్రకటించారు. యువత జీవితం, వారి కలలు, పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయవాడ నేపథ్యంగా సాగే ఈ చిత్రం, నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. వారు జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఎదుర్కొనే సవాళ్లు, ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించారు అనే అంశాన్ని ఈ కథ ప్రధానంగా ఆవిష్కరిస్తుంది. స్నేహబంధం, పట్టుదల, ఆశావాదం వంటి విలువలను హృదయానికి హత్తుకునేలా చెప్పబోతున్న ఈ సినిమా, యువతకు ఒక ప్రేరణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ చిత్ర ప్రయాణానికి అధికారికంగా శ్రీకారం చుడుతూ, తాజాగా తొలి కాస్ట్ మెంబర్‌ను ఎంతో వినూత్నంగా, ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆన్‌బోర్డ్ చేశారు. ఇందుకోసం విజయవాడలోని ఓ ప్రముఖ జంక్షన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మట్టివాసనతో కూడిన సరదా సందేశంతో రూపొందిన ఈ బ్యానర్ సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

“అమెరికాకు వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా… ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు” అంటూ బ్యానర్‌పై ముద్రించిన సందేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా కథను నేరుగా చెప్పకపోయినా, ఈ ఒక్క వాక్యంతోనే ‘ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్’లోని కథా సారాంశాన్ని చెప్పేసినట్టుగా ఉంది. మంచి స్నేహబంధం, బెజవాడకు మాత్రమే సొంతమైన వెటకారం, సహజమైన హాస్యం ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలవనున్నాయని ఈ బ్యానర్ చూసిన వారికే అర్థమవుతోంది. ఈ వినూత్న ఆన్‌బోర్డింగ్‌తో ఇది కేవలం ఒక సినిమా ప్రారంభమే కాదని, కొత్త టాలెంట్‌కు అవకాశాలు కల్పించి వారి కలలను సాకారం చేసే ఒక ప్రాజెక్ట్ అని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలతో పాటు, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్‌ను వెల్లడించనున్నట్లు తెలిపారు. కొత్తదనం, నేటి యువతకు దగ్గరగా ఉండే కథతో ‘ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: