కరోనా మహమ్మారి ఎందరినో పొట్టన పెట్టుకుంటోంది. అందులో ఒకరు నూతన సంవత్సరం వేళ కరోనా కాటుకు గురి మరణించిన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామక్రిష్ణారెడ్డి. ఆయనది నాలుగు దశాబ్దాల  రాజకీయ జీవితం. సుదీర్ఘమైన అనుభవం కలిగిన ఆయన కర్నూలు జిల్లా  రాజకీయాల్లో తనకంటూ సొంత  బాణీని సృష్టించుకున్నారు.

ఆయనలో బహుముఖీయమైన కోణాలు ఎన్నో ఉన్నాయి. చల్లా 1983లోనే పాణ్యం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత కోవెల కుంట్ల నుంచి 1999, 2004లోనూ మరో రెండు సార్లు విజయం సాధించారు. ఇక ఆయన 2014 ఎన్నికల వేళ  టీడీపీలో చేరినా ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. కానీ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా మాత్రం ఎంపిక అయ్యారు.

ఆయన వ్యవ‌సాయంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నారు. కృషి పండిట్ అవార్డుని రాష్ట్రపతి ద్వారా అందుకున్న అరుదైన రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. అంతే కాదు ఆయనలో మంచి కళాకారుడు ఉన్నాడు. చల్లా 1987 ప్రాంతంలో నాటి ప్రముఖ దర్శకుడు జంధ్యాల డైరెక్షన్ లో  తాను హీరోగా, నిర్మాతగా ఒక సినిమా చేశారు. అదే సత్యాగ్రహం.. రాజకీయ నేపధ్యంలో సాగే ఈ మూవీ జంధ్యాల మార్క్ కి దూరం.

అందుకే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ చల్లాలోని నటుడిని మాత్రం బయటకు తెచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా అలనాటి నటీమణి సరిత నటించారు. ఉంగరాల జుట్టుతో హీరోలా ఉండే చల్లాకు ఎందుకో సినిమా తీయాలనిపించడం, తానే హీరోగా వేయాలనిపించడమే చిత్ర విచిత్రం. మొత్తానికి ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కొరత ఒకటి ఉంది. అదే మంత్రి పదవిని సాధించలేక్పోవడం. ఆయనకు కర్నూలు జిల్లా రాజకీయాల్లో పట్టు ఉన్నా కూడా మంత్రి పదవి మాత్రం అందని పండుగానే మారింది. ఆయన మృతి పట్ల అంతా సంతాపం తెలియచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: