పాపం ఓడిపోయారు కదా.. ఆవేదన సహజం అని అర్థం చేసుకోవాలి. కానీ ఆ వేదనలో మరీ తీవ్ర స్థాయి ఆరోపణలు గుప్పిస్తేనే కష్టం. ఇంతకీ విషయం ఏంటంటే.. బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్‌లో రెండు అంపైరింగ్ నిర్ణయాలు సందేహాస్పదంగా నిలిచాయి. ఇందులో అంపైర్లకు దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని.. బంగ్లాదేశ్‌ను ఫిక్స్ చేసి ఓడించారని ఆ దేశ అభిమానులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఐతే మామూలు అభిమానులు ఇలా అంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. సాక్షాత్తు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న బంగ్లా దేశీయుడు ముస్తఫా కమల్ కూడా అంపైర్లు మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేశారని వ్యాఖ్యానించడమే విడ్డూరం. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉంది. అంపైరింగ్ నిర్ణయాలపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని చూస్తోంది.

ఇంతకీ ఈ గొడవంతా ఎందుకంటే.. భారత ఇన్నింగ్స్ సందర్భంగా రోహిత్ శర్మ 90 పరుగులపై ఉన్నపుడు రుబెల్ హుస్సేన్ ఓ పుల్‌టాస్ బంతి విసిరాడు. దాన్ని కాస్త ముందుకొచ్చి రోహిత్ షాట్ ఆడాడు. ఫీల్డర్ క్యాచ్ పట్టాడు. ఐతే బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని అంపైర్ అలీం దార్ నోబాల్ ఇచ్చాడు. ఐతే రీప్లేలో చూస్తే అది నోబాల్ కాదని తేలింది. నాటౌట్‌గా మిగిలిన రోహిత్ ఆ తర్వాత ఎదుర్కొన్న 24 బంతుల్లో 46 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఐతే అప్పటికే భారత్ సురక్షిత స్థితికి చేరింది. ఒకవేళ రోహిత్ ఔటై ఉన్నా ఇంకొకరు అలాగే బాదేవాళ్లని గుర్తుంచుకోవాలి.

ఇంకో తప్పిదమేంటంటే.. మహ్మదుల్లా ఇచ్చిన క్యాచ్‌ను ధావన్ బౌండరీ లైన్ వద్ద అందుకున్నాడు. ఆ సమయంలో అతడి కాలు.. బౌండరీ లైన్‌కు తాకిందని.. కానీ మూడో అంపైర్ పట్టించుకోలేదని అంటున్నారు. ఐతే రీప్లేను చాలాసేపు గమనించాకే అంపైర్ ఔటిచ్చాడు. ఓ కోణంలో కాలు బౌండరీ లైన్‌కు తాకినట్లు అనిపించింది కానీ.. చాలాసేపు రీప్లే చూశాక అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించాడంటే అందులో తప్పిదం ఎందుకుంటుందని అర్థం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: