తిరుపతి పట్టణంలో శ్రీవారి భక్తులను ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చేపట్టిన మెగా ప్రాజెక్టు గరుడ వారధి. ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సహాకారంతో తిరుపతి మునిసిపల్ కార్పోరేషన్ ఈ మెగా ప్రాజెక్టును ఏకంగా 684 కోట్ల రూపాయలతో ప్రారంభించింది. ఆరు కిలోమీటర్ల పొడవైన మెగా ఫ్లై ఓవర్ కు ఏ పేరు పెట్టాలా అని గత ప్రభుత్వం ఎంతోమంది నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది. చివరికి గరుడ వారధిగా దీనికి నామకరణం చేసింది. ఇప్పుడు ఈ పేరు సరికాదని వైసీపీ సర్కార్ భావించింది. తిరుమలేసునికి ఎంతో ఇష్టమైన గరుడుడి పేరున్న వంతెనపై వాహనాలు తిరగడం ఏ మాత్రం మంచిది కాదని కౌన్సిల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. వారధి పేరును మార్చాలని తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గరుడ వారధి పేరును శ్రీనివాస సేతుగా మారుస్తున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిపాదించగా... కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వచ్చే భక్తులు తిరుపతి నగరంలో ఎలాంటి ట్రాఫిక్ చిక్కుల్లో ఇబ్బంది పడకుండా నేరుగా అలిపిరి చేరుకునేలా ఈ ఫ్లై ఓవర్ ను నిర్మిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇంజినీరింగ్ విభాగం పరిశీలిస్తోందని టీటీడీ చెబుతోంది. ప్రస్తుతం గరుడ వారధి పేరు మార్పు అంశం మరోసారి వివాదానికి తెర లేపుతోంది. కేవలం గత ప్రభుత్వం పెట్టిన పేరును కావాలనే వైసీపీ సర్కార్ మారుస్తోందని టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆరోపించారు. కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికే ఈ వారధి పనులు పూర్తి చేసి.... వాహనాలను అనుమతించాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా పనులు వాయిదా పడ్డాయి. మరో ఆరు నెలల పాటు పనులను పొడిగించారు అధికారులు. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ వారధిపై స్వామి వారి నామాలను ఏర్పాటు చేయడంపై కూడా గతంలో పెను దుమారం చెలరేగింది. పిల్లర్లకు రెండు వైపులా కూడా స్వామి వారి తిరునామాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే పైన వాహనాలు తిరుగుతున్న సమయంలో కింద నామాలు ఉంచడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నలు రావడంతో... ఆ నామాలను తొలగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: