తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ నేటితో పూర్తయింది. ఆరు స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగగా అన్ని స్థానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. మొత్తం 12 స్థానాలకు గాను ఆరు స్థానాలను ఇప్పటికే టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసి గెలిచింది. తాజాగా ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లో కూడా కారు ఖాతాలో పడ్డాయి. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ రావు విజయం సాధించారు. టిఆర్ఎస్ అభ్యర్థికి 486 ఓట్లు పోల్ అవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థికి 239 ఓట్లు  పోల్ అయ్యాయి. ఇక్కడ 767 ఓట్లకు గాను  738 ఓట్లు పోలయ్యాయి. ఇక నల్గొండ టిఆర్ఎస్ అభ్యర్థి ఎంసి కోటిరెడ్డి సాధించారు. టిఆర్ఎస్ అభ్యర్థికి 917 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత నగేష్ కు 226 ఓట్లు పోలయ్యాయి.

నల్గొండలో 1270 ఓట్లకు గాను 1230 ఓట్లు నమోదయ్యాయి. ఇక మెదక్ లోను టిఆర్ఎస్ గెలుపొందింది. టిఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి విజయం సాధించారు. ఇక టిఆర్ఎస్ కు 584 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 200 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి దండే విట్టల్  ఘన విజయం సాధించారు. కరీంనగర్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్.రమణ విజయం సాధించారు. వారిద్దరూ 400కు పైగా ఓట్లు సాధించగా, స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ 175 ఓట్లకే పరిమితమయ్యారు.ఇక్కడ భానుప్రసాద్ 500, రమణ నాలుగు వందల ఓట్లు సాధించారు.

ఈటెల,కాంగ్రెస్ నేతల మద్దతుతో పాటు తెరాస అసంతృప్తుల బలంతో  గెలుస్తానని రవీందర్ నమ్మకం పెట్టుకున్నారు. అయితే టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో క్యాంపు రాజకీయాలతో ఓటర్లు చేజారిపోకుండా కాపాడుకొని విజయం సాధించింది. దీంతో రవీందర్ ముందస్తు సంబరాలు వృధా అయ్యాయి. ఈటెల రాజకీయం కూడా ఇక్కడ పని చేయలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖమ్మం స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. క్రాస్ ఓటింగ్ జరుగుతుందని భావించినప్పటికీ టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీకే ఓటు వేశారు. అలాగే మెదక్ లో తన భార్యను బరిలోకి దింపిన జగ్గారెడ్డికి చుక్కెదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: