ఓ వైపు పార‌ద‌ర్శ‌క పాల‌నే త‌మ ధ్యేయం అని  ముఖ్య‌మంత్రి చెబుతుంటే అందుకు విరుద్ధంగా అధికారులు వ్య‌వ‌హ‌రిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకువ‌స్తున్న వైనం విజ‌య‌వాడ‌కు స‌మీపాన ఉన్న గుడ్ల‌వ‌ల్లేరులో చోటుచేసుకుంది. ఆ వివరం ఈ క‌థ‌నంలో...

కృష్ణా జిల్లా,గుడ్ల‌వ‌ల్లేరు మండ‌ల కేంద్రంలో ఉన్న గ్రామ స‌చివాల‌యం - 2 లో అవినీతి నిరోధ‌క అధికారులు హ‌ల్ చ‌ల్ చేశారు.అదే సచివాల‌యంకు చెందిన ఉద్యోగి ఫిర్యాదుతో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుంట‌గా ఓ రెవెన్యూ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. పట్టాదారు పాసు పుస్త‌కం జారీకి సంబంధించి ఓ రైతు నుంచి ఆమె ఐదు వేలు డిమాండ్ చేయ‌గా వీఆర్వో వ‌సుంధ‌రను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.దీంతో ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌న‌మైంది.ఇప్ప‌టిదాకా గ్రామ స‌చివాల‌యాల‌పై పెద్ద‌గా ఏసీబీ అధికారుల దాడులు లేవు.అదేవిధంగా అవినీతి ఆరోప‌ణ‌లు కూడా పెద్ద‌గా లేవు. కానీ రెండున్నర ఎక‌రాల పొలానికి సంబంధించి ప‌ట్ట‌దారు పాసు పుస్త‌కం ఇచ్చేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేయ‌డం, ఈ విష‌య‌మై అదే కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న ల్యాండ్ సూప‌ర్వైజ‌ర్  సురేశ్ అనే ఉద్యోగి ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఒక్క‌సారిగా కృష్ణా జిల్లా యంత్రాంగం ఉలిక్కిప‌డింది.

గుడ్ల‌వల్లేరు మండ‌లంలోని,వేమి గుంట గ్రామానికి చెందిన రైతు త‌న పొలానికి సంబంధించి పాసుపుస్త‌కం ఇవ్వాలంటూ గత కొన్నిరోజులుగా గ్రామ స‌చివాల‌యం చుట్టూ తిరుగుతున్నాడు.కానీ ఆమె మాత్రం ఇందుకు అంగీక‌రించ‌డం లేదు.దీంతో విసుగు చెందిన రైతు త‌న గోడును మ‌రో ఉద్యోగికి చెప్పుకోగా, అతడు అత్యంత చాక‌చ‌క్యంగా వీఆర్వోను ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టించి, ఆమెను క‌టక‌టాల వెనక్కు పంపేలా చేయ‌గ‌లిగాడు. రాష్ట్రంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌రుచూ జ‌రిగినా అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు చిక్క‌డం అన్న‌ది పెద్ద‌గా జ‌ర‌గ‌దు. కానీ ఇక్క‌డ మాత్రం స‌చివాల‌యంలో ప‌నిచేస్తున్న ఉద్యోగే బాధిత రైతుకు సాయం చేయ‌డం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి:

acb