ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు. రాజధాని కీవ్ పై ఇంకా పట్టుకోల్పోలేదని తెలిపారు. యుద్దం వీడితేనే శాంతి నెలకొంటుందన్నారు. మరోవైపు ఉక్రెయిన్ ఆక్రమణ కోసం భారీ దాడికి రష్యా సైన్యం సిద్ధమవుతోంది. దేశ రాజధాని కీవ్ నగరాన్ని ఆక్రమించడం కోసం మరో 20వేల మంది గెరిల్లా ఆర్మీని యుద్ధ రంగంలోకి పంపడానికి చర్యలు చేపట్టింది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అటు శత్రు సైన్యాన్ని ఉక్రెయిన్ దళాలు ప్రతిఘటిస్తున్నాయి. కీవ్ కు 10కిలోమీటర్ల దూరంలో రష్యా హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ.. ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. విక్టరీ అవెన్యూలో రష్యాదాడిని తిప్పికొట్టిన ఉక్రెయిన్.. వాసిల్కివ్ లో రష్యా విమానాన్ని కూల్చేసినట్టు ప్రకటించింది.

నాయకుడంటే నడిపించేవాడే కాదు.. ఆపద వస్తే వెంట నడిచేవాడు కూడా అని నిరూపిస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ. ముప్పేట దాడికి దిగిన రష్యా సేనలను ఎదుర్కొంటున్న తన బలగాలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని ఆర్మీ దుస్తులు ధరించారు. ఇది ఉక్రెయిన్ సేనల్లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది. అంతేకాక ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఇక రష్యాతో మూడవ రోజుకు చేరిన యుద్ధంలో ఆ దేశానికి చెందిన 3వేల 500మంది సైనికులు చనిపోయినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. 14రష్యా విమానాలు, 102 ట్యాంకర్లును, 8హెలికాప్టర్లను, 536 సాయుధ బలగాల వాహనాలు, 15ఆర్టిలరీ వ్యవస్థలను ధ్వంసం చేశామంది. రష్యా సేనలతో తమ బలగాలు వీరోచితంగా పోరాడుతున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఈ విషయాన్ని రష్యా ఇంకా ధృవీకరించలేదు.

రష్యా దాడులతో అందమైన, ప్రశాంతమైన ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం కకావికలమవుతోంది. జనావాసాలపై దాడులు చేయడం లేదని.. సైనిక స్థావరాలపైనే చేస్తున్నామని రష్యా బయటకు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అక్కడ ప్రజలు నివసించే అపార్ట్ మెంట్ పై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఇందులో ఆ భవంతి ఓ పక్క పూర్తిగా నాశనమైంది. ఎంతమంది చనిపోయారనే దానిపై స్పష్టత రాలేదు.






మరింత సమాచారం తెలుసుకోండి: